Mahaa Daily Exclusive

  సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం…

Share

  • సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం
  • సింగరేణిని దోచుకుంటున్న కాంగ్రెస్ ను ఆపేందుకే సిపిఐ కి మద్దతు ఇస్తామని చెప్పాము
  • సేవాలాల్ జయంతి వేడుకల్లో కేటీఆర్

హైదరాబాద్, మహా: సింగరేణి కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు, మున్సిపల్ రాజకీయ పరిస్థితులు, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు మరియు పండుగ శుభాకాంక్షలపై స్పందించారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తన మద్దతు సిపిఐకి ప్రకటించిందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సీపీఐ మరియు కాంగ్రెస్ ఇప్పటికే అలయన్స్‌లో ఉన్నాయని, కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. అయితే ఏఐటీయూసీ వంటి సీపీఐకి అనుబంధ సంస్థ కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయో తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే ఎవరు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

మున్సిపల్ హంగ్ పరిస్థితులపై

రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయని అన్నారు.

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని తెలంగాణ భవన్‌లో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, భుక్యా జాన్సన్ రాథోడ్, వాల్యా నాయక్, రామచంద్రు నాయక్, రాంభల్, గాంధీ నాయక్, కరాటే రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితర నేతలతో కలిసి భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు.

“మా తండాల్లో మా రాజ్యం ఉండాలి” అన్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. గిరిజన గూడాలు, కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి వేలాది గిరిజన యువతకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారని చెప్పారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారని వివరించారు. అలాగే ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను రక్షించిందీ బిఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.

జల్ – జంగల్ – జమీన్ స్ఫూర్తితో కెసిఆర్ పాలన

కొమురం భీమ్ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని కేటీఆర్ తెలిపారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. గిరిజన యువతకు ప్రభుత్వ సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు కూడా అందించి ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చామని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేసినట్లు చెప్పారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా గిరిజన గౌరవానికి నిదర్శనమని అన్నారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అండగా నిలబడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Latest