- హంగూ హస్తగతమే
- నేడు మేయర్, ఛైర్మన్ల ఎన్నిక
- నిజామాబాద్ లో చక్రం తిప్పిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
- కరీంనగర్ లో చక్రం తిప్పుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్
- జగిత్యాల ఎపిసోడ్ కు హైకమాండ్ తెర
- తొర్రూరులో చక్రం తిప్పిన ఝాన్సీరెడ్డి.. ఎర్రబెల్లికి చెక్
- ఆదిలాబాద్ లో చక్రం తిప్పిన కంది.. కాంగ్రెస్ గూటికి స్వతంత్రులు
- కందికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల ఫోన్లు
- – ఆదిలాబాద్ గెలుపుకోసం నరేష్ జాదవ్, కంది శ్రీనివాసరెడ్డిల కృషి
- – కామారెడ్డిలో చక్రం తిప్పిన షబ్బీర్ అలీ
- కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు
(మహా నెట్ వర్క్ )
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారు. కాంగ్రెస్ లో ఈ స్థాయి పట్టుదల, వ్యూహ నిర్మాణం గతంలో కనబడలేదు. మునిసిపల్ ఎన్నికల్లో 70కు పైగా మునిసిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ కు దక్కగా, ఏ పార్టీకి మెజారిటీ దక్కని మునిసిపాలిటీలు కైవసం చేసుకునేదిశగా కాంగ్రెస్ గీసిన స్కెచ్ కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రి మంత్రులతో నిర్వహించిన భేటీలో ప్రతీ హంగ్ మునిసిపాలిటీపై చర్చించడంతో పాటు ప్రత్యేక బాధ్యులను కూడా నియమించారు.
– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కృషి నిజామాబాద్ కార్పోరేషన్ హస్తగతమవుతోంది. ఇక్కడ బిజెపి పెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీకి 2సీట్ల దూరంలో ఉన్న పరిస్థితిని కాంగ్రెస్ అవకాశంగా మలుచుకుంది. పీసీసీ చీఫ్ మహేష్ ఎత్తుగడలతో నిజామాబాద్ మేయర్ హస్తగతమవుతోంది. ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిపి ఈ కార్పోరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయనుంది.
– భైంసా, రాయికల్, అమరచింత, మెట్ పల్లి, కాగజ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, ఆదిలాబాద్ చైర్మన్ పీఠాలపై ఆశలు పెట్టుకోగా, భైంసాను ఎంఐఎంకు వదిలేసి మిగతా మునిసిపాలిటీలన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ ఈ మేరకు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
– కరీంనగర్ కార్పోరేషన్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, మిగతా పక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్ విజయవంతమవుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగడంతో సీన్ మారుతోంది. ఈ కార్పోరేషన్ కైవసానికి పొన్నం పట్టుదలగా ఉన్నారు.
– ఆదిలాబాద్ లో మొత్తం 49 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ కు 25 అవసరం. బీజేపీకి 21 స్థానాలు ద్కాయి. ఐదుగురు ఇండిపెండెంట్లు అక్కడ ఉన్నారు. వారితో కలిసి బీజేపీ మున్సిపల్ చైర్మన్ కోసం ప్రయత్నం చేపట్టగా, కాంగ్రెస్ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. నలుగురు ఇండిపెండెంట్లను కాంగ్రెస్ క్యాంపుకు తరలించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ బలం 27కు పెరగ్గా, ఈ మునిసిపాలిటీని కైవసం చేసుకోనుంది. ఆదిలాబాద్ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు కంది శ్రీనివాసరెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ , మంత్రులు మాట్లాడి ఆదిలాబాద్ గెలుపుపై కార్యాచరణ నిర్దేశించినట్లు తెలుస్తోంది. నరేష్ జాదవ్, కంది శ్రీనివాసరెడ్డి ల శ్రమతో ఆదిలాబాద్ మునిసిపాలిటీ రాజకీయం మారిపోయింది.
– తొర్రూరులో బీఆర్ఎస్ కు మునిసిపాలిటీ పీఠం దక్కకుండా టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఎక్స్ అఫీషియోగా ఎంపీ కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చేరడంతో రాజకీయం మారిపోయింది.
– జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లతో చర్చలు జరిపి, జగిత్యాల మునిసిపాలిటీలో ఛైర్మన్ వివాదానికి కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది.
– కార్పోరేషన్ లలో ఒక్క కొత్తగూడెంలోనే సీపీఐతో పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉండగా, మిగతా ఆరు కార్పోరేషన్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
– కామారెడ్డిలోనూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ చక్రం తిప్పి ఇండిపెండెంట్లతో పాటు పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కూడా తనవైపు తిప్పుకున్నారు.
– నారాయణపేటలో ఎక్స్ అఫీషియో రాజకీయం సాగుతోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఎక్స్ అఫీషియోతో చక్రం తిప్పుతున్నాయి.
– మొత్తంగా హంగ్ లలోనూ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేలా పనిచేస్తోంది.








