Mahaa Daily Exclusive

  ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ..

Share

  • ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ
  • – బహ్రయిన్, సౌదీ రాజులకు ఫోన్‌కాల్స్
  • – భారతీయుల బాగోగులపై ఆరా
  • – గల్ఫ్ దేశాలపై దాడి దారుణం

 

మహా

పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ వేళ బహ్రయిన్ రాజు హమాద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌లతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మాట్లాడారు. ఆ రెండు దేశాలపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. ఇక ఇదే సమయంలో బహ్రయిన్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల బాగోగులపై ప్రధాని ఆరా తీశారు. బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజుకు మోదీ చేసిన ఫోన్ కాల్ సంభాషణల వివరాలను భారత ప్రభుత్వ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అంతకుముందు ఆదివారం రోజు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు కూడా భారత ప్రధాని ఫోన్ కాల్ చేశారు. యూఏఈపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. ఆ దాడుల వల్ల యూఏఈలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ కష్టకాలంలో యూఏఈకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవాస భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు యూఏఈ ప్రెసిడెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రాంతీయ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు.

 

అందుకే ఆ దాడులను ఖండించాం

“పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజులతో చర్చించాను. ఆ రెండు దేశాలపై ఇటీవలే ఇరాన్ చేసిన దాడులను ఖండించాను. ఈవిధంగా దాడులు చేయడం అనేది ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు భంగం కలిగించినట్లు అవుతుంది. అందుకే ఆ దాడులను భారత్ ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల యోగ, క్షేమాలను పర్యవేక్షిస్తున్నందుకు బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజులకు ధన్యవాదాలు చెప్పాను” అని పేర్కొంటూ ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు.

Latest