- దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానం.
- అమ్రాబాద్‌లో 42కి చేరిన పెద్దపులుల సంఖ్య.
- 3: 33 శాతం లక్ష్యంగా ‘వనమహోత్సవం’.
- ములుగు జిల్లాలో అత్యధిక అటవీ విస్తీర్ణం
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రం పర్యావరణ పరిరక్షణలో దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల వల్ల పచ్చదనంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69 శాతానికి చేరుకున్నాయి. ఇది జాతీయ సగటు అయిన 23.59 శాతం కంటే గణనీయంగా అధికం కావడం విశేషం. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (22.87%), మహారాష్ట్ర (20.13%), కర్ణాటక (19.96%), తమిళనాడు (17.83%) లతో పోలిస్తే తెలంగాణ అటవీ విస్తీర్ణంలో అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రంలో జీవ వైవిధ్యం వెల్లివిరుస్తోందని, మొత్తం 2,939 వృక్ష జాతులు, 365 పక్షి జాతులతో అడవులు కళకళలాడుతున్నాయని సర్వే వెల్లడించింది.
అటవీ విస్తీర్ణం పెరగడం వల్ల వన్యప్రాణుల సంరక్షణలోనూ అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా నల్లమల్ల అడవుల్లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో కేవలం 12గా ఉన్న పులుల సంఖ్య 2026 నాటికి 42కి చేరుకోవడం పర్యావరణవేత్తలను ఆనందానికి గురిచేస్తోంది. అనుకూలమైన వాతావరణం, వేటాడటానికి తగినన్ని ఆహార జంతువులు అందుబాటులో ఉండటం వల్ల నల్లమల ప్రాంతం దేశంలోనే అతిపెద్ద పులుల ఆవాసంగా గుర్తింపు పొందింది. అలాగే కవ్వాల్ టైగర్ రిజర్వులోనూ 7 పులులు, 41 చిరుతలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న 55 పులుల సంరక్షణ కేంద్రాల్లో నాగార్జున సాగర్ – శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ అతిపెద్దదిగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలన్న సంకల్పంతో ప్రభుత్వం ‘వనమహోత్సవం’ కార్యక్రమాన్ని మిషన్ మోడ్‌లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2024-25లో 19.03 కోట్లు, 2025-26లో 15.73 కోట్ల మొక్కలను నాటడం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని 27,688 చదరపు కిలోమీటర్లకు పెంచగలిగారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే ములుగు జిల్లా 64.64 శాతం అటవీ విస్తీర్ణంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, భద్రాద్రి కొత్తగూడెం (41.38%), జయశంకర్ భూపాలపల్లి (41.15%), మంచిర్యాల (41.09%), కొమురం భీం ఆసిఫాబాద్ (40.24%) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీనికి భిన్నంగా కరీంనగర్ జిల్లా 2.29 శాతంతో అత్యల్ప అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది.
కృష్ణా పరివాహక ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేక పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించడంతో పాటు పర్యాటక ప్రాంతంగానూ తీర్చిదిద్దుతోంది. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం అరుదైన వన్యప్రాణులకు నిలయంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, అటవీ శాఖ నిరంతర నిఘా వల్ల వేటగాళ్ల ముప్పు తగ్గి, జంతువుల సంతతి పెరుగుతోంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే, మరోవైపు హరితహారం వంటి కార్యక్రమాలతో పారిశ్రామిక ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంపొందించడం వల్ల తెలంగాణ రాష్ట్రం హరిత విప్లవంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.






