Mahaa Daily Exclusive

  చైనా నిఘాకు భారత్ ‘చెక్’..! నేటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ సీసీటీవీలే విక్రయించాలి..

Share

  •  నేటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ సీసీటీవీలే విక్రయించాలి.
  •  భద్రతా కారణాలతో కేంద్రం కీలక నిర్ణయం.
  • ‘ఎస్టీక్యూసీ’ సర్టిఫికేషన్ ఉంటేనే మార్కెట్లోకి.
  •  హిక్‌విజన్, టీపీ-లింక్ వంటి కంపెనీలపై నిషేధ ప్రభావం.

ఢిల్లీ, మహా.

భారత నిఘా వ్యవస్థలో నేటి నుంచి ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న చైనా తయారీ సీసీటీవీ కెమెరాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ధ్రువీకరణ లేని సీసీటీవీ కెమెరాల అమ్మకాలను నేటి నుంచి (ఏప్రిల్ 1) దేశవ్యాప్తంగా నిషేధించింది. ఇకపై భారత మార్కెట్‌లో కేవలం ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు లేదా ప్రభుత్వం నిర్దేశించిన కఠిన భద్రతా ప్రమాణాలను పాటించే కెమెరాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

నిజానికి, నాణ్యతా ప్రమాణాలు లేని సీసీటీవీ యూనిట్లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం 2025 ఏప్రిల్‌లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, వ్యాపారుల వద్ద ఉన్న పాత స్టాక్, దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను అమ్ముకోవడానికి 2026 మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ గడువు నిన్నటితో ముగియడంతో, నేటి నుంచి కొత్త నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. ఈ నిర్ణయం ప్రధానంగా హిక్‌విజన్, టీపీ-లింక్ వంటి చైనా దిగ్గజ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కంపెనీలు భారత ప్రభుత్వ ‘ఎస్టీక్యూసీ’ ధ్రువీకరణను పొందలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. తద్వారా దేశీయ తయారీదారులకు మార్కెట్‌లో సమాన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వదేశీ తయారీ సంస్థలు స్వాగతిస్తున్నాయి. నిఘా పరికరాల విశ్వసనీయత పెరగడానికి, డేటా భద్రతకు ఈ నిబంధనలు ఎంతో అవసరమని సీపీ ప్లస్ (ఆదిత్య ఇన్ఫోటెక్) వంటి సంస్థలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఈ మార్పు వల్ల సామాన్య వినియోగదారులపై కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆల్ ఢిల్లీ కంప్యూటర్ ట్రేడర్స్ అసోసియేషన్ పేర్కొంది. చైనా ఉత్పత్తులపై నిషేధం కారణంగా సీసీటీవీ కెమెరాల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం దేశీయంగా సీసీటీవీ కెమెరాలకు ఉన్న భారీ డిమాండ్‌లో కేవలం 5 శాతం మాత్రమే స్వదేశీ కంపెనీలు తీర్చగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సరఫరా కొరత ఏర్పడకుండా ఉండాలంటే దేశీయ తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచుకోవాల్సి ఉంటుంది. కేవలం అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా, కీలకమైన చిప్‌లు, మదర్‌బోర్డులను కూడా భారత్‌లోనే తయారు చేసుకుంటేనే ధరలను అదుపులో ఉంచడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా, చైనా కెమెరాల నిషేధంతో భారత నిఘా వ్యవస్థ మరింత సురక్షితంగా మారనుందని కేంద్రం ధీమా వ్యక్తం చేస్తోంది.

Latest