Mahaa Daily Exclusive

  ‘పౌరసత్వ తనిఖీ ఈసీ పని కాదు’.. ఎన్నికల సంఘంపై ఒవైసీ తీవ్ర అభ్యంతరం..

Share

  • ఎన్నికల సంఘంపై ఒవైసీ తీవ్ర అభ్యంతరం.
  •  బెంగాల్ ఎన్నికల వేళ ‘సర్’ ప్రక్రియపై రగడ.. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్.

 

కోల్‌కతా, మహా.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన తరుణంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక ప్రక్రియపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌరసత్వాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని, అది కేవలం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బెంగాల్ పర్యటనకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘సర్’ ప్రక్రియ ద్వారా పౌరసత్వాన్ని నిర్ధారించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై తాము ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని వెల్లడించారు. ఈ విషయంలో ఈసీ తన పరిధిని అతిక్రమిస్తోందని ఆయన ఆరోపించారు.

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎంఐఎం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హుమాయన్ కబీన్ నేతృత్వంలోని జన ఉన్నయన్ పార్టీతో కలిసి బరిలోకి దిగుతున్న ఒవైసీ.. ముర్షిదాబాద్ వేదికగా భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. ఓటర్ల జాబితా ఖరారులో జరుగుతున్న ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వివాదాస్పద జాబితాలో ఉన్న పేర్లను వెంటనే ఖరారు చేయాలని, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఇలాంటి జాప్యం ఓటర్ల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగాల వంటి స్థానిక సమస్యలతో పాటు జాతీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఒవైసీ స్పష్టం చేశారు.

మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. ‘సర్’ ప్రక్రియ పేరుతో రాష్ట్రంలోని నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బిహార్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ నుంచి అక్రమ ఓటర్లను బెంగాల్ జాబితాలో చేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆమె మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 6.45 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 5.23 లక్షల మంది కొత్త (యువ) ఓటర్లు ఉన్నారు. రెండు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి దశ ఏప్రిల్ 23న, రెండో దశ ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 4న వెలువడనున్న ఫలితాలు దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

Latest