Mahaa Daily Exclusive

  హరీశ్‌ రావువి ‘వాటా’ రాజకీయాలు..! నాదర్‌గుల్ భూములపై మంత్రి పొంగులేటి నిప్పులు..!

Share

  • ఆ రిజిస్ట్రేషన్లు మీ హయాంలోవి కావా? ‘
  • నా కుమారుడు భూమి కొనలేదు.. దమ్ముంటే నిరూపించు.
  • పొంగులేటి సంచలన సవాల్!

**హైదరాబాద్:**

నాదర్‌గుల్ భూముల విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధారాలతో సహా తిప్పికొట్టారు. సదరు భూములకు 2014లోనే రిజిస్ట్రేషన్లు, 2016లో మ్యుటేషన్లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే చేసిందని, అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. వట్టినాగులపల్లి భూములను తన కుమారుడు కొనలేదని, కేవలం డెవలప్‌మెంట్‌కు మాత్రమే తీసుకున్నారని స్పష్టం చేస్తూ.. ప్రతిపక్ష నేతలు తనపై వ్యక్తిగత కక్షతోనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బుధవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్లతో కలిసి పొంగులేటి ధ్వజమెత్తారు. తాము కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా నాదర్‌గుల్ భూముల విషయంలో హరీశ్‌ రావు చేస్తున్న విమర్శలను ఆయన ఆధారాలతో సహా తిప్పికొట్టారు.

నాదర్‌గుల్ సర్వే నంబర్ 613లోని భూముల చరిత్రను వివరిస్తూ పొంగులేటి కీలక విషయాలను వెల్లడించారు. ఈ భూములను 2014లోనే మూడు సంస్థలకు అప్పటి బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని, 2016లో మ్యుటేషన్ కూడా వారి హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఆనాడు రిజిస్ట్రేషన్లు చేసి, మ్యుటేషన్లు పూర్తి చేసిన వారు.. ఇవాళ ఆ పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టాలని చూడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పైగా, ఈ భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, అప్పట్లో నాలా కన్వర్షన్ కోసం సదరు సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్తే, ప్రభుత్వం తరపున కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ భూములు ప్రభుత్వానివని సుప్రీంకోర్టులో బలమైన కౌంటర్ దాఖలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. హరీశ్‌ రావుకు ఆనాడు అందిన ‘వాటాలు’ ఇవాళ అందకపోవడం వల్లే ఇలాంటి దుష్ప్రచారాలకు తెరలేపారని ఆయన ఘాటుగా విమర్శించారు.

తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలను కూడా మంత్రి పొంగులేటి తీవ్రంగా ఖండించారు. హరీశ్‌ రావు ‘అబద్ధాలరావు’గా మారిపోయారని, హరీశ్‌ రావు చెబుతున్న కంపెనీల్లో తన కుటుంబ సభ్యులు ఉన్నట్లు నిరూపిస్తే ఏ చర్యకైనా సిద్ధమని సవాల్ విసిరారు. వట్టినాగులపల్లి భూముల విషయంలోనూ తన కుమారుడిపై బురద జల్లుతున్నారని, వాస్తవానికి తన కుమారుడు అక్కడ భూమి కొనలేదని, షా కుటుంబానికి చెందిన భూమిని డెవలప్‌మెంట్ కోసం నలుగురు కలిసి తీసుకున్నారని వివరించారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టడం హరీశ్‌ రావు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ అండతో ‘హోమ్’ అనే సంస్థ ఓఆర్‌ఆర్‌లో పోయిన భూమిని కాజేయాలని చూసిందని, ఆనాటి అక్రమాలన్నింటినీ తాము బయటకు తీస్తామని హెచ్చరించారు.

చివరగా, స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు. శాసనసభ వంటి దేవాలయంలోనూ ఆధారాలు లేకుండా వేల కోట్ల అవినీతి జరిగిందని అరుస్తున్నారని, సన్నబియ్యం పథకంపై ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బీఆర్‌ఎస్ ఉనికే ఉండదని భయంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ఏ పాలసీ తెచ్చినా అది ప్రజలందరికీ సమాన న్యాయం జరిగేలా ఉంటుందని, గత పాలకులలాగా వాటాల కోసం పాకులాడే సంస్కృతి తమది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

Latest