Mahaa Daily Exclusive

  బండికి ‘సన్’ స్ట్రోక్!

Share

బండికి ‘సన్’ స్ట్రోక్!
*కేంద్ర మంత్రి తనయుడిపై పోక్సో కేసు నమోదు.
* పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్.
* ఇదంతా నాపై జరుగుతున్న రాజకీయ కుట్ర,
* బ్లాక్‌మెయిల్ డ్రామా..బండి సంజయ్.
* కరీంనగర్‌లో ఎదురు కేసు పెట్టిన కుమారుడు భగీరథ్.
* దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు**
హైదరాబాద్, మహా.

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమార్‌కు ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్ వ్యవహారం తీవ్ర తలనొప్పిగా మారింది. తనయుడిపై అత్యంత తీవ్రమైన ‘పోక్సో’ చట్టం కింద పోలీసు కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ నమోదైన ఈ కేసు వ్యవహారం.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. బాధ్యతాయుతమైన హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర క్యాబినెట్ నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే, ఇదంతా తన ఎదుగుదలను ఓర్వలేక తనపై జరుగుతున్న భారీ రాజకీయ కుట్ర అని బండి సంజయ్ ఖండించారు.
**అసలేం జరిగిందంటే..**
హైదరాబాద్ శివార్లలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై శుక్రవారం రాత్రి పోక్సో కేసు నమోదైంది. ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆరు నెలలుగా భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడని, స్నేహితుల ద్వారా పరిచయం పెంచుకుని మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని సదరు మహిళ తన ఫిర్యాదులో ఆరోపించారు. బాధిత బాలిక మైనర్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 74, 75 సెక్షన్లతో పాటు, పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద భగీరథ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
**హనీట్రాప్.. బ్లాక్ మెయిల్ అంటున్న భగీరథ్**
ఈ పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులపై బండి భగీరథ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. తనను కావాలనే హనీట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. పరిచయం పేరుతో ఆ కుటుంబం తనను వాడుకుందని, వారి ప్రవర్తన నచ్చక దూరంగా ఉంటే.. తప్పుడు కేసులు పెడతామని బెదిరింపులకు దిగారని ఆరోపించారు. వారి బెదిరింపులకు భయపడి సదరు బాలిక తండ్రికి తాను యాభై వేల రూపాయలు కూడా ఇచ్చానని, అయినా డిమాండ్ల పర్వం ఆగకపోగా, డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ పోలీసులు సదరు బాలిక కుటుంబంపై సెక్షన్ 308(5) (దోపిడీ), 351(2) (క్రిమినల్ బెదిరింపు) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
**పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: బీఆర్ఎస్**
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై ఏకంగా పోక్సో కేసు నమోదు కావడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే కేంద్ర హోంశాఖలో కీలక పదవిలో ఉన్న తండ్రి.. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల దర్యాప్తును నీరుగార్చే అవకాశం నూటికి నూరు శాతం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిష్పాక్షికమైన విచారణ జరగాలంటే బండి సంజయ్ తక్షణమే తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో ప్రధాని మోదీ ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టం ముందు సామాన్యులైనా, కేంద్ర మంత్రులైనా సమానమేనని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటున్నారు.
**నాపై రాజకీయ కుట్ర: బండి సంజయ్**
తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై బండి సంజయ్ స్పందిస్తూ ఇదంతా పక్కా రాజకీయ కుట్ర అని తేల్చిచెప్పారు. ఎదుగుతున్న తన రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బతీసేందుకు, సమాజంలో తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు పన్నిన పద్మవ్యూహమే ఇదని ఆయన ఆరోపించారు. కొందరు కావాలనే పథకం ప్రకారం ఓ కుటుంబాన్ని ప్రయోగించి హనీట్రాప్ డ్రామా ఆడించారని, డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, వాస్తవాలు త్వరలోనే పోలీసుల విచారణలో నిగ్గుతేలుతాయని ఆయన స్పష్టం చేశారు.