తెలంగాణపై ప్రగతి సంతకం.
*’నేడు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ.
*రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల హోరు.
* జహీరాబాద్, వరంగల్ పారిశ్రామిక రంగాలకు మహర్దశ.
* రహదారులు, రైల్వే కనెక్టివిటీ, వైద్య రంగానికి పెద్దపీట.
* సర్వాంగ సుందరంగా ముస్తాబైన సభా వేదికలు.
*మధ్యాహ్నం 3 గంటలకు నగరానికి రాక..
* సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ.
* అణువణువూ ఉక్కు కవచంలా భద్రత.
* గగనతలంలో డ్రోన్లపై కఠిన నిషేధం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథచక్రాలకు మరింత వేగం జతచేస్తూ, అభివృద్ధి అజెండాను పరుగులు పెట్టించేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా అత్యున్నత బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తెలంగాణ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసేలా, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ఏకంగా రూ. 9,400 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ లాంఛనంగా శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన పనులను జాతికి అంకితం చేయనున్నారు. ఒకవైపు పాలనాపరమైన కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభ ద్వారా రాజకీయంగానూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి ఆతిథ్యం ఇచ్చేందుకు మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
**పారిశ్రామిక ప్రగతికి ఊపిరిపోస్తూ..**
రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారించేలా, యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రధాని ఈ పర్యటనలో అద్భుతమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రూపురేఖలను మార్చేసే ‘స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్’ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. భవిష్యత్తులో ఆటోమొబైల్, భారీ యంత్ర పరికరాలు, లోహ, ఆహార శుద్ధి పరిశ్రమలకు ఈ టౌన్‌షిప్ కేంద్ర బిందువుగా మారనుంది. దీని ద్వారా పదివేల కోట్ల రూపాయల మేర భారీ పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే, పీఎం మిత్ర పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించి నేతన్నలకు సరికొత్త ఆశలు కల్పించనున్నారు.
**రవాణా వ్యవస్థలకు సరికొత్త జవసత్వాలు**
పారిశ్రామిక అభివృద్ధితో పాటే మౌలిక రవాణా వసతుల కల్పనపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో అత్యంత కీలకమైన 167వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. సుమారు రూ. 3,175 కోట్లకు పైగా భారీ వ్యయంతో గుడెబెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు ఈ నాలుగు లేన్ల రహదారిని నిర్మించనున్నారు. అలాగే పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చేందుకు నగర శివారులోని మల్కాపూర్‌లో రూ. 600 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన ‘గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్’ ప్రాజెక్టును దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గమైన గ్రాండ్ ట్రంక్ రైల్వే కారిడార్‌లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు ఖాజీపేట-విజయవాడ మధ్య రూ. 1,535 కోట్లతో చేపట్టిన 118 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్ సిస్టమ్ ప్రాజెక్టును కూడా ఈ పర్యటనలోనే ప్రధాని ప్రారంభించనున్నారు. వైద్య రంగంలో అత్యాధునిక క్యాన్సర్ సేవలు అందించేలా ఏర్పాటు చేసిన మల్టీ సూపర్ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ ‘సింధు ఆసుపత్రి’ సైతం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
**నిమిషాల మీద సాగనున్న పర్యటన.. పకడ్బందీ ఏర్పాట్లు**
ప్రధాని మోదీ పర్యటన అత్యంత పకడ్బందీగా, కచ్చితమైన షెడ్యూల్ ప్రకారం సాగనుంది. ఆదివారం ఉదయం బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగే 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని, అక్కడ నూతన ధ్యాన్ మందిర్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)కి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి వైద్యులతో ముచ్చటిస్తారు. ఈ అధికారిక కార్యక్రమాలన్నీ ముగిసిన వెంటనే, సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకుంటారు.
**ఉక్కు కవచంలా భద్రత.. పోలీసుల అప్రమత్తత**
ప్రధాని రాక సందర్భంగా నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీజీ, ఇంటెలిజెన్స్ అధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఉక్కు కవచం లాంటి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాని ప్రయాణించే మార్గాలతో పాటు, హెచ్ఐసీసీ, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకుంది. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పలు కీలక ప్రాంతాలను ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రోన్లు, పారా గ్లైడర్లు వినియోగించరాదని కఠిన ఆంక్షలు విధించారు. సభకు వచ్చే లక్షలాది మంది ప్రజలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. మొత్తానికి ప్రధాని రాకతో అటు పాలనా యంత్రాంగంలో, ఇటు రాజకీయ వర్గాల్లో సరికొత్త కోలాహలం నెలకొంది.








