Mahaa Daily Exclusive

  తెలంగాణ అభివృద్ధికి సహకరించండి….

Share

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి.
* ప్రధాని మోదీకి మహేశ్‌కుమార్‌గౌడ్ బహిరంగ లేఖ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అత్యంత కీలకమైన ఎనిమిది ప్రధాన అంశాలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చి, రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మెట్రో విస్తరణ ఎంతో అవసరమని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా, హైదరాబాద్ చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను మంజూరు చేయాలని విన్నవించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర సుందరీకరణలో భాగంగా ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో కీలకమని వివరించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, రవాణా రంగాన్ని మలుపు తిప్పే రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అనుమతులను వెంటనే ఇచ్చి, పనులు వేగవంతం అయ్యేలా చూడాలని కోరారు. వీటితో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులు, విభజన హామీల అమలు వంటి మొత్తం ఎనిమిది అంశాలను పరిష్కరించి, తెలంగాణ ప్రగతిలో కేంద్రం భాగస్వామి కావాలని మహేశ్‌కుమార్‌గౌడ్ తన బహిరంగ లేఖలో ఆకాంక్షించారు. ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.