- ఏ తప్పూ చేయలేదు
- నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు
- భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది
- సికింద్రాబాద్ సభలో భావోద్వేగానికి గురైన బండి సంజయ్
హైదరాబాద్, మహా : తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో కుట్రలు చేస్తున్నారు.. మేం ఏ తప్పు చేయలేదని.. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడిన బండి సంజయ్ జై శ్రీరామ్ అంటే మాలో ఆవేశాన్ని నింపుతోంది, ఆలోచనలు నింపుతుంది. మాలో పౌరుషాన్ని నింపుతుంది. జై శ్రీరామ్ నినాదమే కేసీఆర్ కుటుంబ గడీలు బద్ధలుకొట్టి మిమ్మల్ని ఫాం హౌస్‌కు పరిమితం చేసిందన్నారు. ఏరోజూ పార్టీ తలవంచుకునే పని చేయలేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఫాం హౌస్‌లో ఎలుకని కాదని, అయ్య పేరు, తాత పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదని.. కాషాయ జెండాను భుజంపై మోసిన వ్యక్తినన్నారు. యువ మోర్చా కార్యకర్తగా, ఏబీవీపీ కార్యకర్త, బీజేపీ కార్యకర్తగా, మోదీ శిష్యుడిగా ఎప్పుడూ తలవంచే ప్రసక్తే లేదన్నారు. నిన్నటి వరకు ఒక లెక్కా, నేటి నుంచి మరో లెక్క ఇక కార్యక్షేత్రంలోనే తేల్చుకుంటానని శపథం చేశారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ 9,400 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చారు. జై శ్రీరామ్ నినాదంతోనే రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు. మోదీ లేకపోతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నడవదు. మేం కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇస్తుంటే.. ఇక్కడి కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి మూటలు మోస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయలేక కాంగ్రెస్ పెద్దలు తెలంగాణకు రావడం మానేశారన్నారు. బెంగాల్‌లో అంత ఈజీగా బీజేపీ గెలవలేదని, అనేక మంది కార్యకర్తలు బలిదానంతో అధికారం సాధ్యమైందన్నారు. మహిళా మోర్చా కార్యకర్తల్ని హత్యాచారం చేశారు, ఇంట్లో కట్టేసి ఎంతో మందిని నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో అమిత్ షా, నరేంద్ర మోదీలు బెంగాల్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు.
కేరళలో ఓ ఏబీవీపీ ర్యాలీకి వెళ్తే ఓ నేత అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్ ఇస్తుంటే మధ్యలో కన్ను బయటకు వచ్చింది. అంతా ఆశ్చర్యపోయాం. పీఎఫ్ఐ మైనారిటీ గూండాలు నా చేతులు కట్టేసి నా కళ్లు పీకేశాయి. అయినా తాను పారిపోయే వ్యక్తిని కాదని దేశం కోసం ధైర్యం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారన్నారు. రాజ్యసభలో సుందరం మాస్టర్ రెండు కాళ్లు నరికేస్తే పెట్టుడు కాళ్లతో పనిచేస్తున్నారు. ఆయనకు ప్రధాని మోదీ రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారన్నారు. పార్టీలో అక్కడక్కడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయని, వాటన్నింటిని పక్కనపెట్టి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువద్దామని, కార్యకర్తలు, అమరవీరుల బలిదానాలకు అప్పుడే విలువు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులిచ్చేది మనం, అభివృద్ధి చేసేది మనం కానీ తెంలగాణ ప్రజల సొమ్మును ఢిల్లీకి దోచి పెడుతున్నారన్నారు. . తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొంటలేదని, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ లేదు, విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసా లేదు, రైతు భరోసా లేదు, రైతు బోనస్ లేదు, కేవలం ఢిల్లీకి పైసలు పంపడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సంజయ్ విరుచుకుపడ్డారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు, రైల్వేకు నిధులు, కొనుగోలు కేంద్రాలకు, శ్మశాన వాటికలకు నిధులు కేంద్రం ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఏ వర్గానికి కొమ్ముకాయమని, సనాతన ధర్మాన్ని కించపరిచేస్తే బీజేపీ కార్యకర్త చూస్తూ ఊరుకోడని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.







