- రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
- వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
- సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని ప్రశంసలు
- అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారుతోందని నరేంద్ర మోదీ
- తెలంగాణపై పెద్దమనసు చూపాలన్న సీఎం రేవంత్ రెడ్డి
- రండి మాతో కలవండి, కలిసి పనిచేద్దామమ్మ మోడీ
హైదరాబాద్, మహా : దేశాభివృద్ధిలో సైబరాబాద్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. సైబరాబాద్ ప్రస్తుతం ఒక అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఎదిగిందని, ముఖ్యంగా సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో ఈ ప్రాంతం విశేషమైన సేవలందిస్తోందని పేర్కొన్నారు. అనేక భారీ ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకోవడం గర్వకారణమని, ఇవన్నీ దేశ పురోగతికి బాటలు వేస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడవ సారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్‌లో ప్రారంభించిన పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కు దేశీయ జౌళి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, దీని ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణ ఎంతగానో లాభపడుతుందని ప్రధాని అన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయి. జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు పనులు (3,175 కోట్ల రూపాయలు). 21 కి.మీ. కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను ( 292 కోట్ల రూపాయలు). 118 కి.మీ. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు ( 1,243 కోట్ల రూపాయలు). హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ పీవోఎల్ (611 కోట్ల రూపాయలు). వరంగల్‌లోని ‘పీఎం మిత్ర’ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (1,695.54 కోట్ల రూపాయలు). జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ( 2,360.54 కోట్ల రూపాయలు).
హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రారంభోత్సవాలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణపై పెద్ద మనసు చూపాలని విజ్ఞప్తి చేశారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2047 నాటికి త్రి త్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ఎదిగేందుకు కావాల్సిన రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. మెట్రో రైల్ విస్తరణ, మూసీ సుందరీకరణ తదితర పథకాలకు నిధులపై ప్రస్తావించారు. రాజకీయాలకు పోవడం లేదన్న సీఎం గతంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో మీరు గుజరాత్ సీఎంగా ఉన్నారని, ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి ఉదారంగా నిధులిచ్చారంటూ, ా తరహాలో మీరు తెలంగాణకు నిధులివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం విజ్ఞప్తిపై స్పందించిన ప్రధాని మోడీ మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ కోసం కేటాయించిన నిధులలాగే తెలంగాణకు కేటాయిస్తే ప్రస్తుతం ఇస్తున్న నిధులలో సగమే వస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ అలాగే కావాలంటే.. తెలంగాణ అనుకున్న స్థాయికి అభివృద్ధి చెందలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడిస్తేనే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయని పేర్కొన్న ప్రధాని మోదీ.. తమతో కలవాలని, కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వరంగల్‌లో ఏర్పాటు కానున్న పీఎం మిత్ర పార్క్.. దేశంలో సరికొత్త వస్త్ర విప్లవాన్ని తీసుకువస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వస్త్ర పరిశ్రమ కీలక పాత్ర పోషించిందని.. తిరిగి ఆ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్ల లోపే ఉండేదని.. కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే సుమారు రూ.5,500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వివరించారు. గత 11 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపు అయినట్లు గుర్తు చేశారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని పేర్కొన్న ప్రధాని మోదీ.. ఇంధన భద్రత కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, అలాగనీ బీజేపీయోతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం ఏ మాత్రం వివక్ష చూపడం లేదని మోడీ పేర్కొన్నారు. రాష్ట్రాలన్నీ సమగ్రాభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు. తెలంగాణకు గతంలో కంటే ఎక్కువ నిధులను కేంద్రం ఇస్తుందన్నారు. అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలు సమప్రాతినిధ్యం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలు, ఎన్నికలు, గెలుపు, ఓటములను పట్టించుకోకుండా ప్రజాహితమే పరమావధిగా పని చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో ఇంధన సంక్షంభం ఉందని, అయినప్పటికీ ప్రజలపై భారం వేయకుండా కేంద్రం ముందుకు వెళ్తుందన్నారు.







