Mahaa Daily Exclusive

  ఆత్మీయ పలకరింపులు.. అరుదైన జ్ఞాపకాలు…

Share

ఆత్మీయ పలకరింపులు.. అరుదైన జ్ఞాపకాలు.
* ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లలో ప్రధాని సందడి.
*హైదరాబాద్‌లో ప్రధాని మోదీ బిజీబిజీ.
* ఒకే రోజు పలు అభివృద్ధి పనుల ప్రారంభం, అగ్రనేతల నివాసాలకు రాక.
*చంద్రబాబు ఇంట పూజలు.. పవన్ నివాసంలో పరామర్శలు.
* హైదరాబాద్ పర్యటనలో ప్రధాని ఆత్మీయ ముద్ర.
*మూడు తరాలతో ముచ్చట్లు.. మనవడికి ఆశీస్సులు.
* చంద్రబాబు నివాసంలో గంటకు పైగా ప్రధాని మోదీ.
* రాజకీయాలకు అతీతంగా వ్యక్తిత్వంతో కూడిన గౌరవం.
హైదరాబాద్, మహా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక కార్యక్రమాలతో పాటు ఆత్మీయ కలయికలకు వేదికైంది. ఆదివారం నాటి ఈ పర్యటనలో ఒకవైపు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలకు స్వయంగా వెళ్లి సందడి చేశారు. దశాబ్దాల రాజకీయ అనుబంధానికి, వ్యక్తిగత ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచిన ఈ అరుదైన ఘట్టాలు రెండు కుటుంబాల్లో జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను మిగిల్చాయి.
**అభివృద్ధి పనులకు శ్రీకారం.. సింధు ఆస్పత్రి ప్రారంభం**
హైదరాబాద్ పర్యటనలో తొలుత ప్రధాని మోదీ గచ్చిబౌలిలోని సింధు ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆసుపత్రిలోని రోబోటిక్ శస్త్రచికిత్స విధానాలను, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సేవారంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ఆసుపత్రి బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. అనంతరం హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
**చంద్రబాబు ఇంట ప్రధాని సందడి.. దేవాన్ష్‌తో సరదాగా..**
అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం సాయంత్రం 5:15 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసానికి మోదీ చేరుకున్నారు. ప్రధానికి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని రాకతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. సుమారు గంటకు పైగా (6:20 నిమిషాల వరకు) ఆయన అక్కడే గడిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి మోదీ శ్రీరాముని పూజలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌తో కాసేపు సరదగా గడిపారు. అక్కడే అల్పాహారం స్వీకరించిన అనంతరం చంద్రబాబు, లోకేశ్‌లతో సమావేశమయ్యారు. ఈ పర్యటనపై చంద్రబాబు స్పందిస్తూ.. ప్రధాని తమ ఇంటికి రావడం ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమని, ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంలోని మూడు తరాలతో ప్రధాని కలిసి ఉండటం, దేవాన్ష్‌కు ఆశీస్సులు అందించడం గొప్ప వరమని నారా లోకేశ్ ఉద్వేగంగా వెల్లడించారు.
**పవన్ నివాసంలో పరామర్శ.. కుటుంబ సభ్యుల పరిచయం**
చంద్రబాబు నివాసం కంటే ముందు ప్రధాని మోదీ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని మోదీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే గడిపిన ప్రధాని, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన పిల్లలు అకీరా నందన్, ఆద్య, పొలినా అంజనా, మార్క్ శంకర్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ప్రధానికి పరిచయం చేశారు. అత్యంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన కోసం సమయం కేటాయించి ఇంటికి రావడం మోదీ గొప్ప మనసుకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ఒక దేశ ప్రధాని స్వయంగా ఇంటికి వచ్చి పలకరించడం కేవలం రాజకీయం కాదని, అది వ్యక్తిత్వంతో సంపాదించుకున్న గౌరవమని సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన స్పందించారు.
ఒకే రోజు, ఒకే నగరంలో.. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఇళ్లకు స్వయంగా దేశ ప్రధాని వెళ్లి సమయం గడపడం రాజకీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. హోదాలను పక్కనపెట్టి ఆత్మీయతను పంచిన మోదీ పర్యటన సఫలవంతంగా ముగిసింది.