మహా తెలుగు’ అక్షర గర్జనకు కదిలిన యంత్రాంగం.
* కొండాపూర్ అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా.
* కళ్లు తెరిచిన రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలు.. తక్షణ చర్యలకు రంగం సిద్ధం.
* రూ. 10 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ, 7 అంతస్తుల నిర్మాణ బాగోతంపై ‘మహా తెలుగు పత్రిక’ సంచలన కథనం.
* అక్రమార్కుల గుండెల్లో గుబులు.. వంతపాడిన అధికారుల పైనా వేటుకు కసరత్తు.
ప్రత్యేక ప్రతినిధి, మహా.
పత్రికా దర్పణం పదునైనదైతే.. ఎంతటి అవినీతి కోటలైనా బీటలు వారాల్సిందే. సామాన్యుడి గొంతుకగా మారి, అక్రమార్కుల బండారాన్ని నిర్భయంగా బయటపెడితే ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పరుగులు పెడుతుందో చెప్పడానికి ఈ పరిణామమే సజీవ సాక్ష్యం. ఐటీ కారిడార్ గుండెకాయ లాంటి కొండాపూర్‌లో ఏకంగా రూ. 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబళించి, నిబంధనలకు పాతరేసి ఏడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న భూబకాసురుల వ్యవహారాన్ని ‘మహా తెలుగు పత్రిక’ అత్యంత సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చింది. ఈ సంచలన కథనంతో ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉలిక్కిపడి లేచారు. అక్రమ నిర్మాణాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని, బేషరతుగా ప్రభుత్వ భూమిని కాపాడతామని ఉన్నతాధికారులు ప్రకటించారు.
కొండాపూర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న వోక్స్ వ్యాగన్, కియా కార్ల షోరూమ్‌ల వెనుక వైపు సుమారు ఆరు వందల చదరపు గజాల అత్యంత విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైంది. ప్లాట్ నెంబర్ 13సి తదితర స్థలాల్లో సర్వే నంబర్లు మార్చేసి, టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై కొందరు అక్రమార్కులు బహుళంతస్తుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం కేవలం స్టిల్ట్ ప్లస్ మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు నీళ్లు వదిలి ఏకంగా ఏడు అంతస్తులతో పాటు పెంట్ హౌస్ నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నిర్మాణాలు పూర్తి కాకుండానే సుమారు రూ. 70 లక్షలు చేతులు మారడం ద్వారా అడ్డదారిలో ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) కూడా పొందారన్న నగ్న సత్యాన్ని స్థానికుల ఆధారాలతో సహా ‘మహా తెలుగు పత్రిక’ కళ్లకు కట్టింది.
వాస్తవానికి ఈ ప్రాంతం జోన్ల విభజనకు ముందు శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ పరిధిలో ఉండగా భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఇది కూకట్పల్లి జోనల్ పరిధిలోని మాదాపూర్ సర్కిల్‌లో కలిసింది. ఇదే అదనుగా భావించిన కింది స్థాయి అధికారులు.. ఇది మా పరిధి కాదంటే మాది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ నెలల తరబడి ప్రజలను తప్పుదోవ పట్టించారు. అధికారుల అండదండలతోనే ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం పక్కదారి పడుతోందని, కళ్లెదుటే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతోందని స్థానికులు మొత్తుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.
కానీ, ఎప్పుడైతే ఈ మొత్తం భూకబ్జా, అక్రమ నిర్మాణాల వ్యవహారంపై ‘మహా తెలుగు పత్రిక’ దైర్యంగా అక్షర శరం సంధించిందో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కథనం ప్రచురితమైన వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ స్థాయి అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు హుటాహుటిన స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన ఆకాశహర్మ్యాలను సీజ్ చేయడానికి, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా, కాసులకు కక్కుర్తి పడి ఈ అక్రమాలకు వంతపాడిన అవినీతి అధికారులపైనా కఠినమైన శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఈ పరిణామంతో కొండాపూర్‌లోని భూకబ్జాదారుల్లో తీవ్ర వణుకు మొదలైంది. సామాన్యుడి పక్షాన నిలిచి ఆక్రమణదారుల గుట్టు రట్టు చేయడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ‘మహా తెలుగు పత్రిక’ చూపిన చొరవ పట్ల స్థానిక ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.








