వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన భూముల సర్వే నివేదిక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతికి అందింది. ఈ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అటవీ భూములు లేవని తేలింది.
వైఎస్ జగన్- ఆయన చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదాలకు కేంద్ర బిందువైందీ సంస్థ. ఇందులో షర్మిలకు కేటాయించిన వాటాలను నిలిపివేయాలంటూ వైఎస్ జగన్, ఆయన భార్య భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో సరస్వతి పవర్‌కు గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అటవీ భూములు ఉండొచ్చనే విషయం ఆ శాఖను పర్యవేక్షిస్తోన్న పవన్ కల్యాణ్ సర్వే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనితో పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములను శనివారం రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రీసర్వే నిర్వహించారు. భూములను రికార్డులను పరిశీలించారు.
తహసిల్దార్ క్షమారాణి, అటవీశాఖ అధికారి విజయలక్ష్మీ పర్యవేక్షణలో ఈ సర్వే కొనసాగింది. అందులో అటవీ భూములు, చెరువులు, కుంటలు లేవని తేల్చారు. మాచవరం మండలంలో 1077.38 పట్టా భూములను ఫ్యాక్టరీ యాజమాన్యం గతంలో కొనుగోలు చేసిందని క్షమారాణి వివరించారు.
మాచవరం మండలంలోని చెన్నైపాలెంలో 272.96, పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు భూమిని గతంలో సరస్వతి పవర్ యాజమాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. మొత్తం 1073.38 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేశారని, అవన్నీ పట్టా భూములేనని అన్నారు.
పిన్నెల్లి, వేమవరంలల్లో 4.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. అనంతరం అధికారులు అలాగే వేమవరం, రేవుల గడ్డ, చెన్నై పాలెం నుంచి దాచేపల్లి మండలం తంగెడలో ఉన్న అటవీశాఖ భూముల హద్దులను జీపీఎస్ ద్వారా పరిశీలించారు.
సరస్వతి పవర్‌కు కేటాయించిన స్థలంలో అటవీ భూములు లేవంటూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికతో ఇక రాజకీయ ఆట మొదలైంది. వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కల్యాణ్‌పై విమర్శల దాడి మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్‌కు దిగారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సరస్వతి పవర్‌కు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిందటూ గుర్తు చేస్తోన్నారు.





