- హైదరాబాద్‌లో ఘోరం
- కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య
- ఇంటి ముందే ఘటన
హైదరాబాద్, మహా : నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో శనివారం ఉదయం ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక సీనియర్ న్యాయవాదిని దుండగులు కారుతో ఢీకొట్టి హతమార్చడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన తన కారులో బయలుదేరడాని సిద్ధంగా ఉన్నారు. కారు డోర్ తీస్తున్న సమయంలో ఓ కారు ఆయనను వెనుక నుండి వచ్చి అత్యంత వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అడ్వకేట్ మొయినుద్దీన్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనను గమనించిన స్థానికులు, వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ లాయర్ మొయినుద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్లు, పోలీసులు తెలిపారు.
లాయర్‌ను కారుతో ఢీకొట్టిన అనంతరం నిందితులు అక్కడి నుండి వేగంగా పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
వక్ఫ్ భూముల కోసం పోరాడుతున్న న్యాయవాది
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్నారు లాయర్ ఖాజా మొయినుద్దీన్. హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో ఆయన లాయర్‌గా సేవలు అందిస్తున్నారు. అయితే హిట్ అండ్ రన్ ఘటనలో కొందరు దుండగులు కారుతో ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన ఇంటి వద్ద కారు ఎక్కుతున్న సమయంలో పక్కా ప్లాన్‌తో వెనుక నుంచి వాహనంతో బలంగా ఢీకొట్టి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆయననను హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి చెందారు. కబ్జాకు గురవుతున్న కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ బోర్డు భూములను కాపాడేందుకు ఆయన చట్టపరమైన పోరాటాలు చేస్తుండటమే ఈ హత్యకు ప్రధాన కారణమని వినిపిస్తోంది. లేక వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టి హత్య చేశారన్న వాదన సైతం వినిపిస్తోంది.








