Mahaa Daily Exclusive

  రాజ్యాంగ పరిరక్షణే రాహుల్ గాంధీ లక్ష్యం…

Share

రాజ్యాంగ పరిరక్షణే రాహుల్ గాంధీ లక్ష్యం.
• ఈవీఎంల ద్వారా బీజేపీ ఓట్ల చోరీ.
• దేశాన్ని అప్పులపాలు చేశారు.
• ఆధునిక సాంకేతికతకు రాజీవ్ గాంధీయే ఆద్యుడు.
• టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
భారత రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కొనియాడారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ‘గాంధీ భవన్’ లో శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన మహోన్నత రాజ్యాంగమే ఈ దేశ ప్రజలందరికీ ఒక రక్షణ కవచం (కర్ణుడికి కవచకుండలాల వంటిది) అని, అలాంటి పవిత్రమైన రాజ్యాంగాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రమైన కుట్రలు పన్నుతోందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. నాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ క్యాబినెట్ నేతృత్వంలోనే ఈ రాజ్యాంగం ప్రవేశపెట్టబడిందని, దేశంలోని ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కు ద్వారానే భారతదేశంలో అసలైన ప్రగతి ప్రస్థానం మరియు సుపరిపాలన మొదలయ్యాయని ఆయన గుర్తుచేశారు.
గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ దేశ శ్రేయస్సు, ప్రజల కనీస అవసరాల తీర్చే నిత్యావసరాలు మరియు మౌలిక అభివృద్ధి కోసమే పరితపించిందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నాడు ఇందిరా గాంధీ ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేసి సామాన్యుల సొమ్ముకు భద్రత కల్పిస్తే, రాజీవ్ గాంధీ తెచ్చిన ఐటీ సంస్కరణల వల్లే నేడు దేశంలో టెలిఫోన్, కంప్యూటర్ మరియు సైబర్ సాంకేతికత విప్లవాత్మకంగా అందుబాటులోకి వచ్చాయని వివరించారు. దేశ ప్రజలకు కేవలం ఓటు హక్కు కల్పించడమే కాకుండా, వారి హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించిన ఘనత కూడా గాంధీ కుటుంబానిదేనన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎన్నికల విజయాలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లిందని స్పష్టం చేశారు. అయితే 2019 సాధారణ ఎన్నికల నుండి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని, ఈవీఎంల ద్వారా వ్యవస్థీకృత ఓటు చోరీకి పాల్పడుతూ అక్రమంగా అధికారంలోకి వస్తోందని, దొంగ ఓట్లతోనే వారు గెలుస్తున్నారనే నిజాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచే దేశ ప్రజల ముందు గట్టిగా నిలదీస్తున్నారని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు దేశంపై ఉన్న మొత్తం అప్పు రూ.54 లక్షల కోట్లు మాత్రమేనని, కానీ గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో ఆ అప్పు ఏకంగా రూ.1.47 లక్షల కోట్లకు చేరి దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని జగ్గారెడ్డి గణాంకాలతో సహా విమర్శించారు. మోదీ ప్రభుత్వం మనుషుల స్వేచ్ఛను, హక్కులను కాలరాస్తూ కేవలం మభ్యపెట్టే రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఉన్న గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, రాహుల్ గాంధీ అనుకుంటే పదేళ్ల క్రితమే ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఆ అవకాశం ఇచ్చి దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. ఉపాధి హామీ వంటి చారిత్రాత్మక పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరిచింది కాంగ్రెస్సేనని చెప్పారు. యువతకు ఇస్తామన్న 22 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో సమాధానం చెప్పకుండా, విద్యార్థులను ఉద్యోగాల గురించి అడగనివ్వకుండా భజరంగ్ దళ్, హిందూత్వం పేరిట బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాను ప్రతి సంవత్సరం తన సొంత నియోజకవర్గమైన సంగారెడ్డిలో సీతారామ కల్యాణాన్ని ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తానని, కానీ తెలంగాణలో బీజేపీ నేతలు ఎవరైనా అలా భక్తితో చేస్తున్నారా అని ప్రశ్నించారు. వారు కేవలం దేవుడి పేరును ఓట్ల రాజకీయం కోసమే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇదే క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సరికొత్త వ్యంగ్య వేదిక ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధునిక డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ పార్టీ నేడు బీజేపీ 11 ఏళ్ల వైఫల్యాలపై ఆన్‌లైన్‌లో గట్టిగా పోరాడుతోందని, అయితే ఈ టెక్నాలజీకి పునాది వేసింది కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ అనే విషయాన్ని మరియు గాంధీ కుటుంబ చరిత్రను సదరు నిర్వాహకులు, యువత కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ వల్లే సాధ్యమవుతుందని, అందుకే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశంలో లోక్‌సభ స్థానాల పునర్విభజన (డిలిమిటేషన్) ప్రక్రియ జరిగినా సరే, భవిష్యత్తులో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 500 సీట్లకు పైగా అందించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ ఎంతో అభివృద్ధి చేసిందని, నాడు తెలుగు రాష్ట్రాల ఎంపీ సీట్లతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. విభజన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నా, తెలంగాణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే ఏపీలోని ప్రధాన హామీలన్నీ నెరవేరుతాయని, కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.