తెలుగు రాష్ట్రాల ప్రగతికి మోదీ సర్కార్ అండ.
• మోదీ 3.0 పాలనలో ఏపీకే అత్యధిక లబ్ధి.
• రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టులు.
• తెలంగాణకు 12 లక్షల కోట్ల నిధులు.
• ఆర్థిక సంక్షోభం వేళ దేశ సుస్థిరతకు పంచ సూత్రాలు.
• కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.
**అనంతపురం (గుంతకల్) మహా.
కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ప్రగతి సాధనకు కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఆడిటోరియంలో శనివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’ (19వ విడత) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, ఏడీఆర్ఎం శివప్రసాద్, డీపీఓ హెచ్.ఎల్.ఎన్. ప్రసాద్ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన హస్తాల మీదుగా అర్హులైన 120 మంది యువ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను (అపాయింట్మెంట్ లెటర్స్) అందజేశారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్‌లో ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ అధికారంలో ఉండడం వల్లే రాష్ట్రానికి ఊహించని స్థాయిలో నిధుల వరద పారుతోందని, మోదీ 3.0 పరిపాలనలో దక్షిణ భారతదేశంలోనే కేంద్రం నుండి అత్యధిక ప్రయోజనాలు మరియు లబ్ధి పొందుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నిధుల కేటాయింపుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ పరిధిలో గత రెండేళ్ల స్వల్ప కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా విలువైన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసుకోగలిగామని బండి సంజయ్ గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నగర సర్వాంగ సుందర అభివృద్ధి కోసం ఏకంగా రూ.58 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని, అలాగే తన ఇటీవలి కర్నూలు పర్యటనలో సైతం రూ.13,430 కోట్ల విలువైన ప్రగతి పనులకు అంకురార్పణ జరిగిందని వివరించారు. ఇదే తరుణంలో తెలంగాణ అభివృద్ధిని కూడా కేంద్రం ఎక్కడా విస్మరించలేదని, గత 12 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రగతి చక్రం కోసం మోదీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల భారీ నిధులను ఖర్చు చేసిందని గణాంకాలతో సహా వెల్లడించారు. కేంద్ర పన్నుల తాలూకు బదలాయింపుల (UCF) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అదనంగా రూ.7,766 కోట్లు మంజూరు చేశామని చెబుతూ, కేంద్ర నిధులతో జరుగుతున్న ఈ అద్భుత ప్రగతిని కళ్లారా చూస్తున్న తెలంగాణ ప్రజలు సైతం తమ రాష్ట్రంలో కూడా త్వరలోనే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాల వల్ల నేడు ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారతదేశం ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘సప్త సూత్రాలను’ దేశంలోని ప్రతి పౌరుడు కచ్చితంగా పాటించక తప్పదని పిలుపునిచ్చారు. ప్రజలు చేసే చిన్న పొదుపు దేశ భవితేనే మార్చే అద్భుత మలుపు కానుందని చెప్తూ, ఆ ఏడు సూత్రాలను ఆయన వివరించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని విరివిగా తగ్గించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్ పూలింగ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలను (EV) వాడాలని సూచించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని రక్షించేందుకు బంగారం కొనుగోళ్లు మరియు వంటనూనె వాడకాన్ని పొదుపుగా చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని, ‘వోకల్ ఫర్ లోకల్’ నినాద స్ఫూర్తితో విదేశీ వస్తువులను బహిష్కరించి కేవలం స్వదేశీ, భారతీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని కోరారు. ఇంధన పొదుపు కోసం ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేశ సరిహద్దుల్లో ఎండ, వాన, మంచు తుఫాన్లను తట్టుకుని సేవ చేస్తున్న జవాన్లు ఎంత గొప్పవారో, ఈ సప్త సూత్రాలను పాటించే సాధారణ పౌరులు కూడా అంతే గొప్పవారని కొనియాడారు. నాడు 1965లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వల్ల దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు, దేశ ప్రధాని పిలుపు మేరకు ప్రతి పౌరుడు వారానికి ఒక పూట ఉపవాసం ఉండి ‘జై జవాన్ జై కిసాన్’ నినాదంతో హరిత విప్లవానికి ఎలా నాంది పలికారో, నేడు కూడా అదే దేశభక్తితో మోదీ సప్త సూత్రాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తన రాజకీయ ప్రస్థానంలో నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలను కళ్లారా చూశానని బండి సంజయ్ ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తాను తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి ‘నిరుద్యోగ మార్చ్’ నిర్వహించానని, హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లినప్పుడు అక్కడ తిండికి పైసలు లేక కేవలం అరటి పండ్లు తిని పొట్ట నింపుకుంటూ రాత్రింబవళ్లు చదువుకున్న ఎంతో మంది అభాగ్యుల కన్నీళ్లను చూశానని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోయినా, కేంద్రం మాత్రం 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే చారిత్రాత్మక లక్ష్యంతో 2022 అక్టోబర్ 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రోజ్‌గార్ మేళాను ప్రారంభించిందని చెప్పారు. అప్పట్లో ఇది సాధ్యమయ్యే పనేనా అని చాలా మంది ప్రతిపక్ష నేతలు హేళన చేసినప్పటికీ, వాటిని వేటినీ పట్టించుకోకుండా అవినీతి, పైరవీలు, లీకేజీలు, కోర్టు కేసులు మరియు దళారుల ప్రమేయం లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఇప్పటివరకు 11 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత, కమిట్మెంట్ ఒక్క నరేంద్ర మోదీ సర్కార్‌దేనని సగర్వంగా ప్రకటించారు.
తాజాగా 19వ విడత కింద దేశవ్యాప్తంగా 47 ప్రధాన ప్రాంతాలలో రోజ్‌గార్ మేళా నిర్వహించి మరో 51 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని, ఈ ఉపాధి యజ్ఞాన్ని నిరంతరం ఇలాగే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కష్టపడి చదివి, ఎలాంటి పైరవీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మీరంతా సగర్వంగా గల్లా ఎగరేసుకుని సమాజంలో బతకవచ్చన్నారు. కొత్తగా ఎంపికైన ఉద్యోగులంతా ‘కర్మయోగి’ పోర్టల్ ద్వారా తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని, కేవలం జీతం కోసమే కాకుండా దేశ సేవ కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక శక్తిగా మార్చాలనే ప్రధాని సంకల్పంలో భాగస్వాములు కావాలని కోరుతూ, కేవలం స్వంత కుటుంబానికే పరిమితం కాకుండా, ఉద్యోగులంతా “నేషన్ ఫస్ట్… ఫ్యామిలీ నెక్స్ట్” (ముందు దేశం… ఆ తర్వాతే కుటుంబం) అనే పవిత్ర నినాదంతో, క్రియేటివ్ ఆలోచనలతో అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంత్యోదయ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను దేశంలోని చివరి పౌరుడికి అందిస్తున్న మోదీ నేతృత్వంలోని ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో తెలుగు ప్రజలంతా భాగస్వాములు కావాలని బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.







