సర్’పై అలసత్వం వహిస్తే వేటు తప్పదు!
* ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
* వారం రోజుల్లో తీరు మారకపోతే కొత్త ఇన్‌ఛార్జిల నియామకం.
* పనిచేయకపోతే మంత్రులనైనా మార్చేస్తామని తీవ్ర హెచ్చరిక.
*లౌకికవాదుల ఓట్లకు గండికొట్టే కుట్రలు జరుగుతున్నాయి.
* పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
* ఓటు హక్కు మనిషికి ఆక్సిజన్ లాంటిదన్న ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్.
హైదరాబాద్,మహా.
ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోని సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నిసార్లు దిశానిర్దేశం చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సర్’ ప్రక్రియపై నాయకులకు గట్టి క్లాస్ తీసుకున్నారు. ఓటరు జాబితా సవరణ పేరుతో బీజేపీ క్షేత్రస్థాయిలో భారీ కుట్రలకు తెరలేపుతోందని, ఈ విషయంలో నాయకులు అప్రమత్తంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని సీఎం హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోనే మకాం వేసి, ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తనకు ఒక నియోజకవర్గం అప్పగించినా వెళ్లి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొనడం ఆయన తీవ్రతను తెలియజేస్తోంది.
**గ్రౌండ్ లెవల్‌కు వెళ్లాల్సిందే.. మంత్రులపైనా వేటుకు వెనుకాడం!**
పార్టీ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వెంటనే తమ తీరు మార్చుకోవాలని, వారం రోజుల్లోగా పనితీరులో మార్పు కనిపించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేల స్థానంలో, నియోజకవర్గంలో చురుకుగా పనిచేసే మరో నాయకుడికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తామని సంచలన ప్రకటన చేశారు. పార్టీ కోసం పనిచేయని నాయకులతో పార్టీకి ఎలాంటి అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. పార్టీలో ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ ‘సర్’ విషయంలో క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. “ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు.. ఎవరెవరు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదో నా దగ్గర పక్కా రిపోర్ట్ ఉంది. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే సమావేశంలో అందరి ముందు పేర్లు చదివి వినిపించాల్సి వస్తుంది. దయచేసి పేర్లు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు” అని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రక్రియలో ఇన్‌ఛార్జి మంత్రులు సైతం పూర్తి బాధ్యత తీసుకోవాలని, వారు కూడా పనిచేయకపోతే వారిని మార్చేయడానికి కూడా వెనుకాడబోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
**ఎమ్మెల్యేల తీరు మారాలి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్**
ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సర్’ ప్రక్రియలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలువురు ఎమ్మెల్యేలకు ఆయన తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని, ప్రతి ఓటునూ కాపాడుకోవాల్సిన బాధ్యతను భుజాన వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లౌకికవాదుల ఓట్లను పక్కా ప్రణాళికతో తొలగించేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గద్వాల, మల్కాజిగిరి, భువనగిరి, నిజామాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం చాలా వీక్‌గా ఉందని, అక్కడ తక్షణమే అప్రమత్తం కావాలని ఆదేశించారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమాలకు మెజారిటీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం ఏమాత్రం సబబు కాదని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు.
**ఓటు అనేది సోషల్ స్టేటస్: మీనాక్షి నటరాజన్**
ఓటు హక్కు కేవలం రాజకీయ నాయకుల కోసం మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత కీలకమని ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. మనిషి ప్రాణాలతో జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో.. ఒక పౌరుడికి ఓటు హక్కు కూడా అంతే అవసరమని ఆమె విశ్లేషించారు. ఓటు అనేది ప్రతి మనిషికి ఒక సామాజిక హోదా (సోషల్ స్టేటస్) కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా అనేక పోరాటాలు, కష్టాలు పడితే కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఈ ఓటు హక్కు దక్కలేదని ఆమె గుర్తుచేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపైనా ఉందని మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా వెల్లడించారు.








