Mahaa Daily Exclusive

  దద్దరిల్లిన బల్కంపేట…

Share

  • దద్దరిల్లిన బల్కంపేట
  • పోటెత్తిన భక్తులు
  • వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, మహా : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, కూతురు సుస్మితా పటేల్‌తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తొండోప .తండాలుగా తరలి వారడంతో బల్కంపేట పరిసర ప్రాంతాలలోని వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, దేవాదాయశాఖ చేపట్టిన వరుణ యాగాలు దైవానుగ్రహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్న మంత్రి
అమ్మవార్ల దయతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ప్రభుత్వం కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్ల మధ్య అమ్మవారిని సంతోషంగా దర్శించుకుంటున్నారన్నారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, శివసత్తులకు అమ్మవార్ల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. “తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. నా కూతురు సుస్మితపటేల్ తో కలిసి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వరుణ యాగాలు, ప్రత్యేక పూజలతో అమ్మవార్ల అనుగ్రహం లభించి తెలంగాణపై వరుణదేవుడు వర్షాలతో కరుణ చూపుతున్నాడని భావిస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. ఈ వర్షాలతో రాష్ట్రం పాడిపంటలతో సస్యశ్యామలంగా, సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని మంత్రి కొండా సురేఖ అమ్మవారిని ప్రార్థించారు. బల్కంపేట ఆలయ వైభవాన్ని అందించేందుకు దేవాదాయ శాఖ కట్టుబడి ఉందని మంత్రి సురేఖ తెలిపారు.

అమ్మవారి కృపాకటాక్షంతో వర్షాలు కురుస్తాయి: మంత్రి పొన్నం

మహిమగల బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. లోకకల్యాణం కోసం ఘనంగా జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నామని.. ఎన్‌లినోను కూడా ఎదుర్కుంటామన్నారు. అమ్మవారి కృపాకటాక్షంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. సంవృద్ధిగా వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగేలా దేవాదాయ శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయని.. వాటిని అధిగమించి అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకోవాలని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర మీద ఉండాలని, సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.