- మంత్రి మాట నమ్మి మోసపోయిన రైతులు
- ఉత్తమ్ కు ఉరిశిక్ష వేసినా తప్పులేదు
- మంత్రులు చెప్పేది ఒకటి అధికారులు చెప్పేది మరోటి
- ఇదేం పాలన, ఇదేం రాజ్యమన్న మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, మహా : ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారని, కలెక్టర్ల మాట ఓ తీరుగా, మంత్రి మాటలు మరోలా ఉంటున్నాయని.. ప్రభుత్వానికి పాలనపై క్లారిటీ ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి 10 మోటార్లు నడిపి సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని, కానీ ఇప్పుడు నీళ్లను ఎత్తిపోయకుండా మోసం చేస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి, రైతులకు నీళ్లు ఇవ్వకుండా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. నీళ్లు ఉన్నా కిందకు విడిచిపెట్టడం నేరపూరిత నిర్లక్ష్యం కాదా.. మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదన్నారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మంత్రుల మాటలకు, అధికారుల చర్యలకు పొంతన ఉండటం లేదన్నారు. ఒకవైపు మంత్రులు ప్రతీ ఎకరానికీ నీళ్లు ఇస్తామని చెబుతుంటే మరోవైపు వరంగల్ జిల్లా కలెక్టర్ నీళ్లు ఇవ్వలేమని చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఎవరు చెప్పేది నిజమో, ఎవరు చెప్పేది తప్పో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల మాటలు తప్పయితే వెంటనే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘పాకాల ప్రాజెక్టు కింద 29 వేల ఎకరాలు, రామప్ప కింద 5,500 ఎకరాల ఆయకట్టు ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, మాటలు నిజమని నమ్మి రైతులు నాట్లు వేసుకుంటే ఇప్పుడు అధికారులు పాకాల కింద ఉన్న తూములను మూసివేశారన్నారు. ప్రపంచమంతా నీళ్లను కాపాడుకుంటూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కళ్ల ముందే ఉన్న నీటిని సముద్రంలోకి జారవిడుస్తూ వృథా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క బ్యారేజీలో 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయని, దేవాదుల వద్ద 73 మీటర్ల నీటిమట్టం ఉంటేనే మోటార్లు రన్ చేయొచ్చని, ప్రస్తుతం 78 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నా నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువని, నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల దారుణ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
పంటలను కాపాడుకోవడానికి వరంగల్ జిల్లా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, బిందెలు, సీసాలతో పత్తి చేలకు నీళ్లు చల్లుకుంటున్న వీడియోలు చూస్తూనే ఉన్నామన్నారు. గతేడాది నిర్వహణ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మోటార్ల ప్రారంభం ఆలస్యమైందని, వేసవి టైంలోనే సకాలంలో రిపేర్లు చేయకపోవడం వల్ల వందల కోట్ల విలువైన పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు వేసవిలోనే కొన్ని నెలల ముందుగానే హెచ్చరించినా సర్కార్ మొద్దునిద్ర పోయిందని దుయ్యబట్టారు. నీటిని సకాలంలో విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు తగిన ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా దేవాదుల ప్రాజెక్టును నిర్మించిందని, కేవలం స్విచ్ నొక్కితే చాలు నీళ్లు అందే వ్యవస్థను తయారు చేసి మేం ఇచ్చామన్నారు. కానీ దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్ల సామర్థ్యం 12 టీఎంసీలు కాగా, ప్రతిరోజూ పావు టీఎంసీ నీటిని తోడే ఛాన్స్ ఉన్నా ఇప్పటివరకు ఆ పని చేయలేదన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి నీళ్లను దిగువకు వదిలేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతిపక్షం తాము ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించగానే దేవాదులలో 2 మోటార్లు స్టార్ట్ చేశారని గుర్తు చేశారు. మేం నిలదీస్తే తప్ప ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు








