Mahaa Daily Exclusive

  పర్వతం కింద అణు కేంద్రం….

Share

పర్వతం కింద అణు కేంద్రం.
* వేల సెంట్రిఫ్యూజ్‌లను రహస్యంగా తరలించిన ఇరాన్?
* ఇజ్రాయెల్ నిఘా వర్గాల వెల్లడి.
ఢిల్లీ, మహా.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత గోప్యంగా కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సంచలన సమాచారం వెల్లడించాయి. యురేనియం శుద్ధికి ఉపయోగించే వేలాది సెంట్రిఫ్యూజ్‌లను అత్యంత భద్రత కలిగిన భూగర్భ కేంద్రానికి రహస్యంగా తరలించినట్లు పేర్కొన్నాయి. నతాంజ్ అణు కేంద్రానికి దక్షిణంగా ఉన్న పికాక్స్ పర్వతం దిగువన కొత్త అణు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడ కీలక పరికరాలను నిల్వ చేసినట్లు అమెరికాకు సమాచారం అందించినట్లు వెల్లడించాయి.
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య గత ఏడాది చోటుచేసుకున్న 12 రోజుల ఉద్రిక్తతల అనంతరం ఈ తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన వైమానిక దాడుల్లో నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు దెబ్బతినడంతో, అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక పరికరాలను రక్షించేందుకు ఇరాన్ ఈ చర్యలకు దిగినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
నతాంజ్, ఫోర్డో కేంద్రాల్లో యురేనియాన్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్ వాయువుగా మార్చి, సెంట్రిఫ్యూజ్‌ల సహాయంతో శుద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం శుద్ధి చేసిన యురేనియం వాయు రూపంలోనే ఉందని, అణుబాంబు తయారీకి దానిని లోహ రూపంలోకి మార్చాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
అయితే ఆ చివరి దశ ప్రక్రియకు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్నాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయంగా మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ నిఘా వర్గాల ఈ ఆరోపణలపై ఇరాన్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.