Mahaa Daily Exclusive

  నీట్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చ జరపాలి….

Share

నీట్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.
• విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
• కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఢిల్లీ, మహా.
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్‌, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో తలెత్తిన వివాదాలు, నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన పోలీసు చర్యలపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ అంశాలను రాజకీయాలకు అతీతంగా చర్చించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ప్రత్యేక చర్చకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించిన రాహుల్ గాంధీ, తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు అడిగిన విద్యార్థులకు లాఠీలతో సమాధానం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశ యువత భవిష్యత్తుపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో పూర్తి వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రతిపక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ మరుగున పడనివ్వదని, వీధుల్లోనే కాకుండా పార్లమెంట్‌లోనూ వారి గొంతుకగా నిలుస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్పీకర్‌ను కలిసి నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలపై సభలో చర్చ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనల పట్ల నిరసనగా తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం లేదని ప్రకటించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. పదేపదే జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలకు, లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం స్పీకర్‌ను కలిసి నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై పోలీసు చర్యలపై ప్రత్యేక చర్చకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయపడిన విద్యార్థులను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపించిన ఆయన, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసుల వివరాలు సేకరిస్తామని ప్రకటించారు.