కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టంతో పన్నుల భారం.
* హైదరాబాద్ ప్రజలను దోచుకునే ప్రయత్నం.
* పాత ఇళ్లు పంచకుండా కొత్త హామీలు ఎందుకు?
* బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగర ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పన్నుల భారం మోపేందుకు, పేదలపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టం పేరుతో నగర ప్రజలపై భారీ పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టం, ఇందిరమ్మ ఇండ్ల అమలు విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
1955 మున్సిపల్ చట్టాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా సవరించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టంలోని కీలక నిబంధనలే ప్రజలకు భారంగా మారేలా ఉన్నాయని రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ చట్టంలో శాస్త్రీయ పన్నుల విధానం కనిపించడం లేదని, రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించడం వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడటమే కాకుండా ప్రతి ఏడాది ఐదు శాతం వరకు పన్నులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి సరఫరా, మురుగునీటి సేవలను విడదీసి వేర్వేరుగా పన్నులు విధించడం ద్వారా ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు.
జీహెచ్ఎంసీ పాలనలో ఎన్నికైన కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధుల పాత్రను బలహీనపరిచేలా ఈ చట్టం రూపొందిందని ఆయన ఆరోపించారు. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఈ బిల్లులో జవాబుదారీతనం ఎవరిది, నిధులపై అధికారం ఎవరిది, ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటనే అంశాలపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన చట్టం బదులుగా అధికార కేంద్రీకరణకు దారితీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, నిపుణులు, ప్రజలతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లులోని ప్రతి అంశాన్ని సమగ్రంగా చర్చించి ప్రజల తరఫున గట్టిగా వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార కార్యక్రమంగా మార్చిందని రాంచందర్ రావు విమర్శించారు. ఇల్లు లేని పేదల కోసం పథకం అంటూ ప్రచారం చేస్తూనే, దరఖాస్తు చేసుకునే పేదల నుంచే రూ.100 దరఖాస్తు రుసుముతో పాటు రూ.10 వేల ఈఎండీ డిపాజిట్ వసూలు చేయడం దారుణమన్నారు. 24 నియోజకవర్గాల్లో లక్షలాది మంది అర్హులు ఉన్నప్పటికీ కేవలం 7,680 ఫ్లాట్లకే నోటిఫికేషన్ జారీ చేసి, లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించడం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.1,000 కోట్ల వరకు వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపించారు. డబ్బులు మాత్రం ముందుగానే తీసుకుంటున్న ప్రభుత్వం చివరకు ఎవరికి ఇళ్లు ఇస్తుందో స్పష్టత లేదని, ఇది పేదల ఆశలను వ్యాపారంగా మార్చినట్టేనని విమర్శించారు.
ఈ విధానం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేసిన తీరును గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు దూర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి వాటిని ఖాళీగా ఉంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరినే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బోలక్‌పూర్‌లో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయకుండా ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మాదిరిగానే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎన్నికల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
జవహర్‌నగర్‌లో 20 అంతస్తుల భవనాల్లో నిర్మించిన వందలాది ఫ్లాట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, గత ప్రభుత్వాలు నిర్మించిన అనేక గృహ సముదాయాలు ఇప్పటికీ పేదలకు అందలేదని రాంచందర్ రావు గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో నిర్మించిన సద్భావన టౌన్షిప్, పోచారం, అభిమాన్ టౌన్షిప్ (జవహర్‌నగర్), చందానగర్, గాజులరామారంలోని సహీరా టౌన్షిప్లలోని రాజీవ్ స్వగృహ ఇళ్లు కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరలేదన్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్లపై సీబీసీఐడీ విచారణ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా ఆ హామీ అమలు కాలేదని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సబ్సిడీలను వినియోగించుకుంటూనే రూ.11 లక్షల ఇల్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని రాంచందర్ రావు ఆరోపించారు. పేదలకు నిజంగా న్యాయం చేయాలంటే ముందుగా ఇప్పటికే నిర్మించి ఖాళీగా ఉన్న ఇళ్లను మరమ్మతులు చేసి అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్మించిన ఇళ్లు ఎందుకు పంపిణీ కాలేదనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ నగర ప్రజలపై పన్నుల భారాన్ని మోపే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ గృహాలు అందించాలని, కొద్దిమందికి ఇళ్లు ఇచ్చి ప్రచారం చేసుకోవడం మానుకోవాలని సూచించారు.
ఈ సమావేశానికి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు ప్రముఖులు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. సైనిక్‌పురికి చెందిన సేవా కార్యకర్త జాయ్ మైఖేల్ డిసాజ్వా, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి దినేష్ కుమార్, కూకట్‌పల్లికి చెందిన వ్యాపారవేత్త శ్రావణ్ కుమార్ సామలతో పాటు పలువురు పార్టీ కండువా కప్పుకుని బీజేపీలో చేరగా, వారిని రాంచందర్ రావు సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.








