జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్.
* వార్డుల డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ వద్దన్న న్యాయస్థానం.
* రాజకీయ పార్టీల వ్యూహాలకు తాత్కాలిక విరామం.
హైదరాబాద్, మహా .
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) చట్టబద్ధంగా జరగలేదంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు, వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం ఖరారు చేసే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవద్దని స్పష్టం చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ అనిశ్చితిలో పడింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. జీవో నంబర్ 570 ప్రకారం జనాభా ప్రాతిపదికన వార్డుల డీలిమిటేషన్ చేపట్టాలని, అలాగే మున్సిపల్ చట్టంలోని నిబంధనల మేరకు ప్రజల అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలను పాటించకుండా వార్డుల పునర్విభజన చేపట్టిందని వారు వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం, చట్టబద్ధంగా వార్డుల సరిహద్దులను పునర్నిర్ణయించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయరాదని ఆదేశించింది. తుది విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని స్పష్టం చేసింది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై తాత్కాలిక సందిగ్ధత నెలకొంది.
హైకోర్టు తాజా ఆదేశాలతో ఎన్నికల కోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్న రాజకీయ పార్టీల ప్రణాళికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ విస్తృతంగా సన్నాహాలు ప్రారంభించాయి. జనసేన కూడా పోటీ చేస్తామని ప్రకటించడంతో నగర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు అన్ని పార్టీల ఎన్నికల కార్యాచరణపై ప్రభావం చూపనున్నాయి.
ఇక ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను ఏ విధంగా సమర్థించుకుంటుందన్నదే ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారింది. హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తదుపరి న్యాయపరమైన పరిణామాలపై దృష్టి సారించాయి. న్యాయస్థానం తుది నిర్ణయం వెలువడిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.








