తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఎదురుదెబ్బ.
• క్వాష్ పిటిషన్ కొట్టివేత.
• దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్న న్యాయస్థానం
అమరావతి, మహా.
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే కొనసాగుతోందని పేర్కొన్న న్యాయస్థానం, ఈ దశలో జోక్యం చేసుకోవడం సముచితం కాదని స్పష్టం చేసింది.
అరెస్టు భయం ఉంటే చట్టప్రకారం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తమ్మినేనికి హైకోర్టు సూచించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూలై 29కు వాయిదా వేసింది.
నకిలీ పత్రాలను ఉపయోగించి సుమారు రూ.4 కోట్ల విలువైన భూమిని తన కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలపై తమ్మినేని సీతారాంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున కేసును ఈ దశలో కొట్టివేయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియ కొనసాగనివ్వాలని పేర్కొంటూ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది.








