హైదరాబాద్, మహా.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే తదితరులు నిర్వహించిన నిరసనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జాతీయ సహ ఇన్ఛార్జి (తమిళనాడు, కర్ణాటక) డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. దేశ ప్రజలు పార్లమెంటును ప్రజాస్వామ్య చర్చలకు వేదికగా ఎన్నుకుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పదేపదే వీధి రాజకీయాలు, రాజకీయ నాటకాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని అధికారిక నివాసాన్ని రాజకీయ ప్రదర్శనలకు వేదికగా మార్చే ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ప్రధానమంత్రి మోదీపై కాంగ్రెస్ నాయకులు పదేపదే చేస్తున్న అవమానకర, హీనమైన, వ్యక్తిగత వ్యాఖ్యలను పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రతిపక్షాల హక్కు అయినప్పటికీ, ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం, రాజ్యాంగబద్ధ పదవుల గౌరవాన్ని దెబ్బతీయడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. దేశ ప్రజలు నేడు అభివృద్ధి, సుపరిపాలన, పారదర్శకత మరియు జాతీయ ప్రయోజనాలపై ఆధారపడిన రాజకీయాలను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజా సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు సూచించకుండా, కేవలం నిరసనలు, అడ్డంకులు, అసభ్య వ్యాఖ్యలతోనే రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై అపూర్వమైన గౌరవాన్ని సంపాదించిందని సుధాకర్ రెడ్డి గుర్తుచేశారు. మౌలిక వసతులు, సంక్షేమం, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ ప్రతిష్ఠ వంటి అనేక రంగాల్లో దేశం ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ ప్రజల తీర్పును ఏమాత్రం గౌరవించకుండా రాజకీయ అసహనాన్ని ప్రదర్శించడం అత్యంత విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవిస్తూ, వ్యక్తిగత దూషణలను విరమించుకుని, ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధి రాజకీయాలను మాత్రమే ఆదరిస్తారని, విధ్వంసకర రాజకీయాలను మరోసారి కచ్చితంగా తిరస్కరిస్తారని డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.








