• ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
• ఐదుగురికి ‘ఇందిరా గాంధీ కృషి రత్న’ పురస్కారాల ప్రదానం.
• ఇందిర జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ.
హైదరాబాద్, మహా.
వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగునీటి వసతులు మెరుగుపరచడం ద్వారా రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిన ఐదుగురికి ‘ఇందిరా గాంధీ కృషి రత్న’ పురస్కారాలను ప్రదానం చేశారు.
పురస్కార గ్రహీతలు వీరే..
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఎంపిక చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయుడు, రైతులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. సుగుణాకర్‌రెడ్డి, డాక్టర్ ఎస్.డి. శిఖామణి, వ్యవసాయ రంగంపై విశ్లేషణాత్మక రచనలు, వార్తా కథనాల ద్వారా సేవలందించిన పాత్రికేయుడు ఆర్. దిలీప్‌రెడ్డి, గిరిజన రైతు లోనావత్ శాంతాబాయి, సేంద్రియ వ్యవసాయంలో విశేష కృషి చేస్తున్న కె. లావణ్య ఈ పురస్కారాలను అందుకున్నారు. వ్యవసాయ రంగంలో విభిన్న స్థాయుల్లో సేవలందించిన వారిని ఒకే వేదికపై గౌరవించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది.
ఇందిర సేవలపై ప్రత్యేక పుస్తకావిష్కరణ
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి అందించిన ప్రోత్సాహం, ఆమె హయాంలో సాగు రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులపై రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. భారత వ్యవసాయ చరిత్రలో ఇందిరాగాంధీ పాలనా కాలానికి సంబంధించిన కీలక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు కమిషన్ వెల్లడించింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని, రైతులకు అవసరమైన మద్దతు, వనరులు అందించడం ద్వారా సాగును లాభసాటిగా, స్థిరమైన వృత్తిగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కమిషన్ పేర్కొంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు కె.వి.ఎన్. రెడ్డి, ఎం. భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.








