ఫామ్‌హౌస్ భూముల చిట్టా అసెంబ్లీలో విప్పుతాం!
* కాళేశ్వరం కుంగుబాటుకు కారణాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.
* బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు.
* మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.
* మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా:
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూముల వ్యవహారం కేంద్రబిందువుగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు కుటుంబానికి సంబంధించిన భూముల వరకు సమగ్ర వివరాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్ భూముల సర్వే దాదాపు పూర్తయిందని, త్వరలోనే పూర్తి లెక్కలను వెల్లడిస్తామని ప్రకటించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, భూభారతి పోర్టల్, రాబోయే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫామ్‌హౌస్ భూములపై తుది నివేదిక.. అసెంబ్లీలో ప్రకంపనలు?
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములకు సంబంధించి చేపట్టిన సర్వే ప్రక్రియ దాదాపు పూర్తయిందని పొంగులేటి తెలిపారు. భూముల వాస్తవ విస్తీర్ణం, రెవెన్యూ రికార్డులు, పట్టాదారు వివరాలు, క్షేత్రస్థాయి స్వాధీనం తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సర్వే ప్రారంభమైన సమయంలోనే మాజీ మంత్రి హరీశ్‌రావు మామ తన భూముల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అసెంబ్లీలో బయటపెట్టి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని స్పష్టం చేశారు.
కాగా, ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల మధ్య సర్వే నంబర్లు, గ్రామ సరిహద్దులు, భూముల యాజమాన్యంపై వివాదం గతంలోనే తెరపైకి వచ్చింది. 1957 నుంచి కొనసాగుతున్న భూవివాదం, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న భూమికి మధ్య వ్యత్యాసాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో సర్వే నంబర్ 325 పరిధిలో 388 ఎకరాలు ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయి పరిశీలనలో 343 ఎకరాలే గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. మిగిలిన 45 ఎకరాల అంశం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు సర్వే నివేదికపై మంత్రి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కాళేశ్వరం నిర్మాణాలపై కేసీఆర్‌కు ప్రశ్నల వర్షం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని పొంగులేటి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రతిపాదించి, వాస్తవ నిర్మాణంలో మూడు బ్యారేజీల వద్ద సికెంట్ పైల్స్ విధానాన్ని ఎందుకు ఉపయోగించారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. డీపీఆర్‌లో పేర్కొన్న నిర్మాణ విధానానికి భిన్నంగా ఎందుకు వ్యవహరించారు? అందుకు ఎవరి అనుమతులు తీసుకున్నారు? డయాఫ్రమ్ వాల్‌కు బదులుగా సికెంట్ పైల్స్‌ను ఎందుకు ఎంచుకున్నారు? అన్న అంశాలపై మాజీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నాణ్యత, పునాదుల భద్రత, డిజైన్ లోపాలపై ఇప్పటికే పలు సాంకేతిక పరిశీలనలు జరిగాయి. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీల పునాదుల కింద నీటి ప్రవాహం, కోత సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ నివేదికలోనూ ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన లోపాలను ప్రస్తావించారు. ప్రస్తుతం బ్యారేజీల పునరుద్ధరణకు నిపుణుల సాంకేతిక ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ విధానాలపై కేసీఆర్ వివరణ ఇవ్వాలన్న పొంగులేటి వ్యాఖ్యలు మరో రాజకీయ వివాదానికి తెరతీశాయి.
కాంగ్రెస్‌లో ఎంతో కంఫర్ట్‌గా ఉన్నా.. మళ్లీ గోల్ కొడతాం!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఎంతో కంఫర్ట్‌గా ఉన్నానని, వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తమ ఐదుగురికి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఆట ఎలా ఆడాలో, ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసని, సరైన సమయంలో రాజకీయ యుద్ధం ప్రారంభించి విజయం సాధిస్తామని అన్నారు. మళ్లీ గోల్ కొట్టి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి నో మోర్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలు!
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎన్ని రాజకీయ వ్యూహాలు రచించినా ఫలితం ఉండదని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో బీజేపీ నాయకులు వ్యవహరిస్తే అది వారి రాజకీయ తప్పిదమే అవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటేనే గొప్ప విషయమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పునరుద్ఘాటించారు.
భూభారతి సమస్యలకు పరిష్కారం
ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్‌పై కూడా మంత్రి స్పందించారు. పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు దాదాపు పరిష్కారమయ్యాయని తెలిపారు. భూ రికార్డుల్లో తప్పులు, భూముల హద్దుల వివాదాలు, పట్టాదారు వివరాల్లో వ్యత్యాసాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూ రీసర్వేలో నవంబర్ 11 నాటికి 1,000 గ్రామాల్లో సర్వే ప్రారంభించగా, 416 గ్రామాల్లో పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. తొలి దశలో 32 జిల్లాల్లో 2,720 గ్రామాలను సర్వే పరిధిలోకి తీసుకున్నారు. సుమారు 125 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ ప్రక్రియతో భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.








