Mahaa Daily Exclusive

  సుప్రీంకోర్టు న్యాయమూర్తికి బదులు ఒవైసీకి గౌరవ వందనం!

Share

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి బదులు ఒవైసీకి గౌరవ వందనం!
* ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌ సర్క్యూట్‌ హౌస్‌లో పోలీసుల ప్రోటోకాల్‌ పొరపాటు.
* ఒవైసీ వెంట భారీ భద్రతా సిబ్బంది ఉండటంతో గందరగోళం.
* విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.

సహారన్‌పూర్,మహా.

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌ సర్క్యూట్‌ హౌస్‌లో శనివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అధికారికంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైన పోలీసులు, పొరపాటున ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి గౌరవ వందనం సమర్పించారు. న్యాయమూర్తి రాకకు ముందే ఒవైసీ అక్కడికి చేరుకోవడంతో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఆయననే ప్రముఖ అతిథిగా భావించి గౌరవ వందనం ఇచ్చినారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది.

భారీ భద్రతా సిబ్బంది రాకతో గందరగోళం.

ఆజాద్‌ సమాజ్‌ పార్టీ అధినేత, ఎంపీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకున్నారు. ఆయన అక్కడ వేచి ఉండగా, దాదాపు 20 నిమిషాల తర్వాత అసదుద్దీన్‌ ఒవైసీ తన భద్రతా సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. ఒవైసీ వెంట పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ఉండటంతో విధుల్లో ఉన్న పోలీసుల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గౌరవ వందనాన్ని పొరపాటున ఒవైసీకి సమర్పించారు. పోలీసులు సెల్యూట్‌ చేయడంతో ఆయన అక్కడే నిలబడి ఆ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై విచారణకు ఆదేశం.

గౌరవ వందనం అనేది నిర్దేశిత నిబంధనలు, అధికారిక ప్రోటోకాల్‌ ప్రకారం ప్రత్యేక ప్రముఖులకు లేదా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి సమర్పించే సంప్రదాయ గౌరవం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారి పదవుల రీత్యా సాధారణంగా గౌరవ వందనం ఇచ్చే నిబంధన లేదు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. గౌరవ వందనం సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోసం ఏర్పాటు చేశామని, సిబ్బంది పొరపాటున ఎంపీ ఒవైసీకి సమర్పించారని సహారన్‌పూర్‌ నగర పోలీసు అధికారి వ్యోమ్‌ బిందాల్‌ స్పష్టం చేశారు. ఈ ప్రోటోకాల్‌ పొరపాటుపై విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, సర్క్యూట్‌ హౌస్‌లో ఒవైసీ, చంద్రశేఖర్‌ ఆజాద్‌ సంయుక్తంగా నిర్వహించాల్సిన మీడియా సమావేశం రద్దయింది. అనంతరం ఇద్దరు నేతలు కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.