Mahaa Daily Exclusive

  బంగారం ధరల పతనం…

Share

బంగారం ధరల పతనం.
* తాకట్టు రుణాలపై బ్యాంకర్ల బాదుడు!
* పసిడి విలువ 32 శాతం దిగువకు.
* అదనపు నగదు చెల్లించాలంటూ ఖాతాదారులకు సందేశాలు.
* రూ.23.30 లక్షల కోట్ల గోల్డ్ లోన్ మార్కెట్‌లో ప్రకంపనలు!
* తెలుగు రాష్ట్రాల్లోనే రూ.5.76 లక్షల కోట్లకు పైగా బంగారు రుణాల భారం.

హైదరాబాద్, మహా:

బంగారం అంటే భద్రత.. అవసరమైతే ఆదుకునే ఆస్తి.. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచే సంపద. కానీ ఇప్పుడు అదే బంగారం కొందరికి ఆర్థిక భారంగా మారుతోంది. ధరలు భారీగా పెరిగిన సమయంలో ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నవారికి, పసిడి ధరలు పడిపోవడంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాకట్టు బంగారం విలువ తగ్గడంతో రుణానికి తగిన భద్రత లేదంటూ కొన్ని బ్యాంకులు, బంగారు రుణ సంస్థలు ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. అదనపు బంగారం తాకట్టు పెట్టాలని, కొంత రుణాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ సందేశాలు పంపుతున్నట్లు రుణగ్రహీతలు చెబుతున్నారు.

ఇది కేవలం బంగారం ధరల తగ్గుదలకు సంబంధించిన పరిణామం మాత్రమే కాదు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న బంగారు రుణ మార్కెట్‌లోని ఆర్థిక ఒత్తిడిని బయటపెడుతున్న సంకేతం కూడా. 2026 జనవరిలో గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధరలు నవంబర్ నాటికి గణనీయంగా తగ్గాయి. ఇదే సమయంలో దేశంలో బంగారు రుణాల బకాయిలు రూ.23.30 లక్షల కోట్లకు చేరడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ రుణాల వాటా గణనీయంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.

పది గ్రాముల బంగారంపై రూ.58 వేలకుపైగా తగ్గుదల!

2026 జనవరి 29న దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు గరిష్ఠ స్థాయికి చేరాయి. పది గ్రాముల ధర సుమారు రూ.1.80 లక్షలకు చేరగా, నవంబర్ 21 నాటికి సుమారు రూ.1.22 లక్షల స్థాయికి పడిపోయినట్లు మార్కెట్ నివేదికలు వెల్లడించాయి. అంటే పది గ్రాములపై దాదాపు రూ.58 వేల తగ్గుదల నమోదైంది. గరిష్ఠ ధరతో పోలిస్తే సుమారు 32 శాతం పతనం కనిపించింది.

ఈ తగ్గుదల ప్రభావం తాకట్టు రుణాలపై ఎలా ఉంటుందో పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షల విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.7.50 లక్షల రుణం తీసుకున్నాడనుకుందాం. అదే బంగారం విలువ 32 శాతం తగ్గితే దాని మార్కెట్ విలువ రూ.6.80 లక్షలకు పడిపోతుంది. రుణ బకాయి మాత్రం రూ.7.50 లక్షలుగానే ఉంటుంది. అంటే బంగారం విలువ కంటే రుణం రూ.70 వేల మేర ఎక్కువవుతుంది. దీనికి వడ్డీ కూడా కలిస్తే వ్యత్యాసం మరింత పెరుగుతుంది. అయితే ఇది ఉదాహరణ మాత్రమే. వాస్తవ లెక్కలు బంగారం స్వచ్ఛత, నికర బరువు, రుణం మంజూరైన తేదీ, చెల్లించిన వాయిదాలు, వడ్డీ, ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.76 లక్షల కోట్ల రుణాల అంచనా!

సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ నవంబర్ 2026 నివేదిక ప్రకారం సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా బంగారు రుణాల బకాయి రూ.23.30 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 15.9 శాతం, తెలంగాణ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ వాటాలను దేశవ్యాప్త రుణ బకాయికి వర్తింపజేస్తే ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.3.70 లక్షల కోట్లు, తెలంగాణలో రూ.2.05 లక్షల కోట్ల బంగారు రుణాలు ఉన్నట్లు అంచనా. రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ మొత్తం సుమారు రూ.5.76 లక్షల కోట్లు. ఇవి నివేదికలో నేరుగా ప్రకటించిన రాష్ట్రాలవారీ బకాయిలు కాకుండా, దేశవ్యాప్త వాటా ఆధారంగా లెక్కించిన అంచనాలు.

ఏడాదిలో 60.6 శాతం పెరిగిన రుణ మార్కెట్!

దేశంలో బంగారు రుణాల విస్తృతి వేగంగా పెరుగుతోంది. 2025 సెప్టెంబర్ నాటికి రూ.13.40 లక్షల కోట్లుగా ఉన్న రుణ బకాయిలు 2026 జూన్ నాటికి రూ.21.70 లక్షల కోట్లకు, సెప్టెంబర్ నాటికి రూ.23.30 లక్షల కోట్లకు చేరినట్లు సీఆర్‌ఐఎఫ్ నివేదిక వెల్లడించింది. ఏడాదిలోనే రూ.9.90 లక్షల కోట్ల పెరుగుదల నమోదైంది. వృద్ధి రేటు 60.6 శాతం. ఇదే సమయంలో క్రియాశీల రుణ ఖాతాలు 8.97 కోట్ల నుంచి 10.22 కోట్లకు పెరిగాయి. రుణ ఖాతాల సంఖ్యతో పోలిస్తే రుణాల మొత్తం విలువ వేగంగా పెరుగుతుండటం గమనార్హం.

రోజుకు సగటున రూ.8,865 కోట్ల రుణ మంజూరు!

2026 జూలై నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా రూ.8,19,544 కోట్ల బంగారు రుణాలు మంజూరైనట్లు నివేదిక వెల్లడించింది. ఈ 5 నెలల్లో 399.4 లక్షల రుణ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈ లెక్కల ప్రకారం రోజుకు సగటున రూ.8,885 కోట్ల రుణాలు మంజూరైనట్లు అంచనా. ఒక్కో రుణానికి సగటు మంజూరు మొత్తం సుమారు రూ.2.21 లక్షలు. ఇవి దేశవ్యాప్త గణాంకాలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రోజువారీ రుణ మంజూరు మొత్తాలకు సంబంధించిన ప్రత్యేక గణాంకాలు అందుబాటులో లేవు.

వసూళ్లలో ఒత్తిడి.. బ్యాంకులకు కొత్త సవాలు!

సెప్టెంబర్ 2026 నుండి అక్టోబర్ వరకు బకాయి పడిన బంగారు రుణాల శాతం 1.5కు చేరింది. జూన్‌లో ఇది 0.9 శాతంగా ఉంది. 91 నుంచి 180 రోజుల వరకు బకాయి ఉన్న రుణాలు 0.3 నుంచి 0.6 శాతానికి పెరిగాయి. దీర్ఘకాలిక బకాయిలు ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ, ప్రారంభ దశలో చెల్లింపుల ఆలస్యం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం ధరల పతనం కొనసాగితే రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యం, రుణ సంస్థల వసూళ్లపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది.

ఎన్‌బీఎఫ్‌సీల దూకుడు.. ప్రభుత్వ బ్యాంకుల వాటాలో తగ్గుదల!

బంగారు రుణాల వ్యాపారంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు పోటీ పెరుగుతోంది. 2025 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్త రుణాల విలువలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 49.3 శాతంగా ఉండగా, 2026 జూలై–అక్టోబర్ నాటికి 46.3 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 24.4 శాతం నుంచి 32.4 శాతానికి పెరిగింది. ప్రైవేటు బ్యాంకుల వాటా 14.9 శాతంగా ఉంది. బంగారు రుణ వ్యాపారంలో ఎన్‌బీఎఫ్‌సీలు వేగంగా విస్తరిస్తున్నాయని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఆర్బీఐ నిబంధనలు.. అదనపు చెల్లింపు తప్పనిసరా?

రిజర్వ్ బ్యాంక్ 2025 జూన్ 6న బంగారం, వెండి తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వినియోగ అవసరాల కోసం ఇచ్చే రుణాల్లో రూ.2.5 లక్షల వరకు గరిష్ఠంగా 85 శాతం, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలకు మించిన రుణాలకు 75 శాతం రుణం-బంగారం విలువ నిష్పత్తిని నిర్ణయించింది. ఈ పరిమితులను రుణ కాలమంతా కొనసాగించాల్సి ఉంటుంది.

అయితే బంగారం ధర తగ్గిందనే కారణంతో పాత రుణగ్రహీతలందరూ వెంటనే అదనపు నగదు చెల్లించాలనే నిబంధన లేదు. రుణం మంజూరైన తేదీ, వర్తించే ఆర్బీఐ మార్గదర్శకాలు, రుణ ఒప్పందం, రుణానికి సంబంధించిన భద్రతా నిష్పత్తి ఆధారంగా బ్యాంకులు చర్యలు తీసుకుంటాయి. అందువల్ల బ్యాంకు నుంచి సందేశం అందుకున్న ఖాతాదారులు తమ రుణ ఒప్పందాన్ని పరిశీలించి, అధికారిక శాఖను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.

వేలం వరకు వెళితే.. బంగారం తిరిగి దక్కుతుందా?

రుణగ్రహీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం రుణ సంస్థలు తాకట్టు బంగారాన్ని వేలం వేయవచ్చు. అయితే వేలం ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. విక్రయం ద్వారా వచ్చిన మొత్తంలో రుణ బకాయిని సర్దుబాటు చేసిన తర్వాత మిగులు ఉంటే ఖాతాదారుడికి తిరిగి చెల్లించాలి. వేలం మొత్తం రుణ బకాయికి సరిపోకపోతే ఒప్పంద నిబంధనల ప్రకారం మిగిలిన మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల బంగారాన్ని తాకట్టు పెట్టినవారు రుణ గడువులు, వడ్డీ చెల్లింపులు, బ్యాంకు నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

సామాన్యుడి ఆభరణాలే ఇప్పుడు ఆర్థిక భద్రతకు పరీక్ష!

రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం, చిరు వ్యాపారులు వ్యాపార అవసరాల కోసం, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వివాహాలు వంటి అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. ధరలు పెరిగిన సమయంలో అధిక రుణాలు తీసుకున్నవారికి ఇప్పుడు ధరల పతనం ఆర్థికంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు ముగిసినప్పుడు అసలు, వడ్డీని ఒకేసారి చెల్లించే బుల్లెట్ రీపేమెంట్ రుణాలపై ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు.