- గెలుపే ప్రాతిపదికగా సీట్ల సర్దుబాటు.
- ఎస్పీ-కాంగ్రెస్ కలిసికట్టుగా అభ్యర్థులను ఎంపిక.
- ఇండియా కూటమి తరఫున గెలిచే వారికే టికెట్లు.
- ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.
లక్నో, మహా.
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాయని ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. రెండు పార్టీల నాయకులు కూర్చొని సమన్వయంతో చర్చించి బలమైన అభ్యర్థులను గుర్తిస్తారని తెలిపారు. సీట్ల సంఖ్య కంటే గెలుపు అవకాశాలకే తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. శుక్రవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన అఖిలేశ్, ఇండియా కూటమి తరఫున గెలిచే అభ్యర్థులనే బరిలోకి దించుతామని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు కూడా సమర్థులైన, గెలిచే అభ్యర్థులనే కోరుకుంటున్నారని, ఎవరికి గెలిచే సత్తా ఉంటే వారికే తమ కూటమి అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
పీడీఏ వ్యూహంతో ఎన్నికల బరిలోకి
2027 అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు. తాము రూపొందించిన ‘పీడీఏ’ (వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు) వ్యూహం ప్రకారమే ఎన్నికల క్షేత్రంలో ముందుకు సాగుతామని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలతో పాటు సామాజిక సమీకరణాలు, పీడీఏ వ్యూహాన్ని కూడా ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన వివరించారు.
ప్రాధాన్య స్థానాలపై చర్చలు
కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్న ప్రశ్నకు అఖిలేశ్ స్పందిస్తూ, సీట్ల సంఖ్యపై ఇప్పుడే తుది నిర్ణయం చెప్పలేమని తెలిపారు. కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించాలని, ఇరు పార్టీల నేతలు కలిసి వాటిపై కూలంకషంగా చర్చించాలని సూచించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ తొలుత 181 స్థానాలను కోరిందని, అయితే ఎస్పీ తరఫున 26 స్థానాల ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 26 ప్రాధాన్య స్థానాలపై చర్చలు ప్రారంభమయ్యాయని, మిగిలిన నియోజకవర్గాల విషయంలోనూ పరస్పర అవగాహన, గెలుపు సామర్థ్యం ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మరోవైపు, అసదుద్దీన్ ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ మధ్య ఎన్నికల పొత్తుపై అడిగిన ప్రశ్నకు ఆయన క్లుప్తంగా స్పందిస్తూ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు ఎంతో తెలివైనవారని వ్యాఖ్యానించారు.







