Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి – మంత్రి సీతక్క

Share

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ములుగు మండలంలోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ, సీఎం రేవంతరెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. అధికారలోకి వచ్చినప్పటి నుంచి ములుగు నియోజక వర్గంలో సుమారు 30 కోట్ల సీడీఎఫ్ నిధులతో దళిత గిరిజన వాడల్లో సిసి రోడ్స్ డ్రైనేజీలు కల్వర్టు లు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు. అదే విధంగా ములుగులో నూతన బస్ స్టాండ్ నిర్మాణం, ఏటూరు నాగారంలో బస్ డిపో కు నిధులు 80 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. టూరిజం డెవలప్ మెంట్ పంచాయితీ రాజ్ శాఖ నుండి బీటీ రోడ్లకు సుమారుగా 310 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, నాయకులకు, కార్యకర్తలకు మధ్యలో విభేదాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలన్నారు. మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీట్ చేయడం కోసం అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే వారికే స్థానిక సంస్థలలో టికెట్లు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. భూమి లేని రైతు కూలీలను అధ్వానంగా చూశారని, రూ.కోట్లు ఉన్న ఆసాములకు మాత్రం రైతు బంధు సాయం ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest