Mahaa Daily Exclusive

  గ్యాంగ్‌టక్ వీధుల్లో మోదీ సందడి.. యువతతో ఫుట్‌బాల్!

Share

  • గ్యాంగ్‌టక్ వీధుల్లో మోదీ సందడి.. యువతతో ఫుట్‌బాల్!
  • సిక్కిం స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
  • రూ.4,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

గ్యాంగ్‌టక్,మహా.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో ఉత్సాహంగా గడిపారు. అధికారిక కార్యక్రమాల ఒత్తిడిని పక్కనపెట్టి, ఉదయం పూట స్థానిక యువతతో కలిసి మైదానంలో ఫుట్‌బాల్ ఆడారు. వయసుతో సంబంధం లేకుండా కుర్రాళ్లతో కలిసి ఆయన బంతిని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్న దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం ఆయన గ్యాంగ్‌టక్ చేరుకున్నారు.

ఫుట్‌బాల్‌తో ఎంతో ఎనర్జీ వచ్చింది..
ముగింపు వేడుకల అధికారిక కార్యక్రమాలకు ముందు ఉదయం వేళ ప్రధాని మోదీ క్రీడా మైదానంలోకి అడుగుపెట్టారు. యువ ఆటగాళ్లతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రీడా సంబరానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రధాని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. “గ్యాంగ్‌టక్‌లోని ఆహ్లాదకరమైన ఉదయం వేళ.. మన యువ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. కుర్రాళ్లతో కలిసి క్రీడల్లో పాల్గొనడం నాకో ప్రత్యేకమైన అనుభూతి” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని క్రీడా స్ఫూర్తిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

అభివృద్ధి పనుల పరంపర
క్రీడా మైదానంలో ఉల్లాసంగా గడిపిన అనంతరం ప్రధాని మోదీ సిక్కిం అభివృద్ధికి ఊతమిచ్చే కీలక ఘట్టాల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు రూ.4,000 కోట్లకు పైగా విలువైన పలు బృహత్తర ప్రాజెక్టులకు ఆయన లాంఛనంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు రహదారుల కనెక్టివిటీ, మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు, పర్యాటక రంగ అభివృద్ధి, విద్యా మౌలిక సదుపాయాలు, నగర అభివృద్ధి తదితర అంశాలకు ఈ నిధులతో పెద్దపీట వేస్తున్నారు. ప్రధాని పర్యటనతో సిక్కిం స్వర్ణోత్సవ వేడుకలకు మరింత శోభ చేకూరినట్లయింది.