జిబౌటి, మహా.
ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో అత్యంత హృదయవిదారకమైన పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి వెతుక్కుంటూ అక్రమ మార్గంలో వలస వెళ్తున్న ప్రయాణికుల పడవ సముద్రంలో మునిగిపోవడంతో 109 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 116 మంది ఆచూకీ గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో చిన్నమొత్తంలో కాకుండా ఏకంగా 15 మంది చిన్నారులు ఉండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
అంతర్జాతీయ వలస సంస్థ (IOM) వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబరు 8, 9 తేదీల మధ్య రాత్రి సమయంలో జిబౌటిలోని ఒబోక్ పట్టణానికి సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. మొత్తం 350 మంది వలసదారులతో ఒక పడవ జిబౌటి నుంచి యెమెన్ వైపు ప్రయాణం ప్రారంభించింది. ఒబోక్ తీరానికి ఉత్తరంగా సముద్రంలో వెళ్తుండగా ఓవర్‌లోడ్ మరియు ప్రతికూల పరిస్థితుల కారణంగా పడవ ఒక్కసారిగా బోల్తా పడి నీట మునిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికార యంత్రాంగం, అంతర్జాతీయ వలస సంస్థ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 109 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. వీరిలో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది చిన్నారులు (9 మంది బాలికలు, 6 మంది బాలురు) ఉన్నట్లు ఐఓఎం స్పష్టం చేసింది. కాగా, ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన 80 మందికి పైగా క్షతగాత్రులంతా ఇథియోపియా దేశానికి చెందినవారే కావడం గమనార్హం.
ఆఫ్రికా దేశాల్లో నెలకొన్న తీవ్ర పేదరికం, అంతర్గత అభద్రత, ఉపాధి అవకాశాలు లేకపోవడం, వాతావరణ మార్పుల ప్రభావంతో గల్ఫ్ దేశాలకు చేరుకుని బతుకు బండి లాగాలని భావిస్తున్న నిరుపేదలు ఇలాంటి ప్రమాదకర సముద్ర మార్గాలను ఆశ్రయిస్తున్నారు. జిబౌటి నుంచి ప్రమాదకరమైన ‘బాబ్ ఎల్ మండెబ్’ జలసంధి మీదుగా యెమెన్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఇతర గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాలని ప్రయత్నించడం పరిపాటిగా మారింది. అయితే, దలారీల మోసాలు, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఇలాంటి పడవ ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో వలసదారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంటోంది. ప్రస్తుతం సముద్రంలో గల్లంతైన మరో 116 మంది కోసం జిబౌటి అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.







