ఒకే గొడుగు కిందికిరోడ్ల అభివృద్ధి.
* ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.
హైదరాబాద్, మహా.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించే దిశగా హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో రోడ్ల నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో ఆయన రోడ్ల విస్తరణ, పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణంలో అత్యంత కీలకమైన భూసేకరణ, నిధుల సమీకరణ, నిర్వహణ వంటి అంశాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను ఒకే గొడుగు కిందికి తేవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ సరిగా లేకపోవడం, ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ఓఆర్ఆర్ నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రారంభించిన రేడియల్ రోడ్డు-1 పనులను డిసెంబర్ 9వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. రోడ్ల నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రోడ్లకు ఇరువైపులా విధిగా పచ్చదనం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ నిర్మాణంతో పాటు బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ మహానగర భవిష్యత్తు పూర్తిగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎటువంటి అలసత్వం లేకుండా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణ కోసం జరిపే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో దళారులు, మధ్యవర్తుల ప్రమేయం ఏమాత్రం ఉండకూడదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీ చేసే ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.








