Mahaa Daily Exclusive

  యువతను ఇలా నిరాశపరచకూడదు…..

Share

యువతను ఇలా నిరాశపరచకూడదు.
*నీట్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం.
*పారదర్శకతకు కట్టుబడి ఉన్నామంటూ ఎన్టీఏ అఫిడవిట్ దాఖలు.
ఢిల్లీ, మహా.
ఎన్నో ఆశలు, ఆశయాలతో ‘నీట్’ పరీక్ష రాసిన దేశ యువతను ఇలా నిరాశపరచడం ఏమాత్రం తగదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో జరిగిన లీకేజీ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదంటూ గత వారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.
మరోవైపు, ఈ వ్యవహారంలో ఎన్టీఏ సుప్రీంకోర్టులో సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేసింది. తన పర్యవేక్షణలో జరిగే అన్ని పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు తాము పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టేందుకు కేంద్ర విద్యాశాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ ఇస్రో ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులలో మెజారిటీ అంశాలను ఇప్పటికే అమలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
పరీక్షా విధానంలో తాము తీసుకొచ్చిన పలు సంస్కరణలు, భద్రతాపరమైన మార్పులను సైతం ఎన్టీఏ తన అఫిడవిట్‌లో కోర్టుకు సవివరంగా నివేదించింది. సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్తగా 16 సీనియర్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించింది. టెక్నాలజీ ఆపరేషన్స్, టెస్ట్ సెక్యూరిటీ పర్యవేక్షణ బాధ్యతల కోసం ఇద్దరు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులను అడిషనల్ డైరెక్టర్స్ జనరల్‌గా నియమించినట్లు పేర్కొంది. అలాగే, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేయడంతో పాటు, పరీక్ష పూర్తయిన తర్వాత ఆ ఫుటేజీని కనీసం 90 రోజుల పాటు భద్రపరచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది.
ఇకపై నీట్ పరీక్షలను సాంకేతికత ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో నిర్వహించాలా, లేక యథావిధిగా పెన్ అండ్ పేపర్ పద్ధతిలోనే కొనసాగించాలా అనే కీలక అంశంపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు ఎన్టీఏ తెలిపింది. దీనిపై అత్యున్నతస్థాయి కమిటీ సంబంధిత మంత్రిత్వ శాఖలతో విస్తృత సంప్రదింపులు జరుపుతోందని, త్వరలోనే ఓ తుది నిర్ణయం తీసుకోనుందని వెల్లడించింది. అంతేకాకుండా, ఎగ్జామినేషన్ మేనేజ్‌మెంట్‌లో మరింత నైపుణ్యాన్ని జోడించేందుకు ఐఐటీ, యూజీసీ, సీబీఎస్ఈ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నిపుణులను కూడా భాగస్వాములను చేసినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్టీఏ స్పష్టం చేసింది.