Mahaa Daily Exclusive

  స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకుంటే కేసులు వద్దు….

Share

స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకుంటే కేసులు వద్దు.
*సెక్స్ వర్కర్లపై దాడులు చేయడం చట్టవిరుద్ధమన్న సుప్రీంకోర్టు.
* వారి గుర్తింపును బహిర్గతం చేయొద్దని మీడియాకు తీవ్ర హెచ్చరిక.
*నివాస ధ్రువీకరణ లేకపోయినా ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశం.
ఢిల్లీ, మహా
సెక్స్ వర్కర్ల హక్కులు, వారి పట్ల వ్యవహరించాల్సిన తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారిపై దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ వృత్తిలోకి తమ సొంత ఇష్టంతో వచ్చిన వారికి, అలాగే మానవ అక్రమ రవాణా ద్వారా బలవంతంగా ఈ కూపంలోకి నెట్టబడిన బాధితులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పోలీసులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ఈ రెండు వర్గాల మధ్య ఉన్న ప్రధానమైన తేడాను గుర్తించి వ్యవహరించాలని సూచిస్తూ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
మేజర్లుగా ఉండి, స్వచ్ఛందంగా ఈ వృత్తిలోకి వచ్చిన సెక్స్ వర్కర్లపై పోలీసులు దాడులు చేయడం, వారిపై అనవసరంగా కేసులు బనాయించడం ఎంతమాత్రం తగదని కోర్టు తేల్చిచెప్పింది. కేవలం వ్యభిచార వృత్తిలో ఉన్నారనే కారణంతో వారిని వేధించడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంటుందని, ఆ ప్రాథమిక హక్కు సెక్స్ వర్కర్లకు కూడా పూర్తిస్థాయిలో వర్తిస్తుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. పోలీసు శాఖ తమ దృష్టిని సెక్స్ వర్కర్లపై కాకుండా.. అమాయకులను బలవంతంగా ఈ వృత్తిలోకి దించుతూ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యవస్థీకృత నేర ముఠాలపై కేంద్రీకరించాలని సూచించింది.
ఇదే సమయంలో మీడియా వ్యవహారశైలిపైనా న్యాయస్థానం కఠిన నిబంధనలు విధించింది. దాడులు జరిగే సమయంలో లేదా ఇతర సందర్భాల్లో సెక్స్ వర్కర్ల ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం లేదా ప్రచురించడం ద్వారా వారి గుర్తింపును బహిర్గతం చేయడం ముమ్మాటికీ నేరమేనని మీడియా సంస్థలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని ఇతర పౌరుల మాదిరిగానే వారికి కూడా చట్టపరమైన, సామాజికపరమైన రక్షణ కల్పించాలని ఆదేశించింది. అలాగే, సెక్స్ వర్కర్లకు నివాస ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా సరే, వారందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆధార్ కార్డులు జారీ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ను కోర్టు ఆదేశించింది. కేవలం సరైన గుర్తింపు పత్రాలు లేవన్న సాకుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయడం అన్యాయమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.