ఆమె దేశానికి గర్వకారణం.
* వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.
* ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్.
* క్రీడా వ్యవహారాల్లో హైకోర్టుల జోక్యంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం.
ఢిల్లీ, మహా.
భారత స్టార్ రెజ్లర్, మూడుసార్లు ఒలింపియన్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహించిన వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2026 ఆసియా క్రీడల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు పచ్చజెండా ఊపింది. వినేశ్‌కు అవకాశం కల్పిస్తూ గత వారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాతృత్వం అనేది క్రీడాకారుల వృత్తిపరమైన అవకాశాలను అడ్డుకునే వైకల్యం కాదని హైకోర్టు గతంలో స్పష్టం చేయగా, నిబంధనల ప్రకారం ఆమెకు అర్హత లేదని డబ్ల్యూఎఫ్‌ఐ సుప్రీంను ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వినేశ్ ఫొగాట్ దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారిణి అని న్యాయస్థానం కొనియాడింది. ఆమె స్థానంలో వేరెవరైనా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని, హైకోర్టు తీర్పుతో ఆమెలో ఆశలు, అంచనాలు చిగురించాయని ధర్మాసనం అభిప్రాయపడింది. సరిగ్గా ట్రయల్స్ ముంగిట, ఈ దశలో మేం ఏమీ చేయలేమని చెప్పి ఆమెను వెనక్కి పంపడం ఏమాత్రం సరికాదని డబ్ల్యూఎఫ్‌ఐ తరఫు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. అయితే, వినేశ్‌కు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు తాత్కాలిక అనుమతి ఇస్తూనే.. క్రీడా వ్యవహారాల్లో హైకోర్టులు తరచుగా, అత్యంత వేగంగా జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లు కావని, జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన సున్నితమైన వ్యవహారాలని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు. ఈ తరహాలో కోర్టులు పదేపదే జోక్యం చేసుకొని మొత్తం క్రీడా షెడ్యూళ్లను దెబ్బతీయకూడదని హితవు పలికారు. ప్రస్తుతానికి వినేశ్‌ను ఆసియా క్రీడల ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించిన ధర్మాసనం, డబ్ల్యూఎఫ్‌ఐ దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై తమకు తగిన సమాధానం ఇవ్వాల్సిందిగా వినేశ్ ఫొగాట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.








