దేశానికి రుతుపవనాల షాక్.
* ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.
*నైరుతిపై ఐఎండీ కీలక అంచనా.. ఎల్ నినో ప్రభావమే కారణం.
* జూన్లో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత.
ఢిల్లీ, మహా
దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆందోళనకరమైన అంచనాలను వెల్లడించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. 2026 రుతుపవన కాలానికి సంబంధించి విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో కేవలం 90 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చని స్పష్టం చేసింది. ఈ అంచనాల్లో 4 శాతం అటూఇటూగా మార్పులు ఉండొచ్చని తెలిపింది. తాజా అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం ‘సాధారణం కంటే తక్కువ’ కేటగిరీలోకి రానుండటంతో, ఇది సాగు నీటి లభ్యత, జలవనరులు మరియు ఖరీఫ్ సీజన్ పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడటానికి పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ‘ఎల్ నినో’ పరిస్థితులే ప్రధాన కారణమని ఐఎండీ వివరించింది. సాధారణంగా ఎల్ నినో ప్రభావం ఉన్నప్పుడు రుతుపవన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. మరోవైపు, వర్షాలకు అనుకూలించే ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) ప్రస్తుతం తటస్థంగా ఉందని, రుతుపవన కాలం ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగే వీలుందని పేర్కొంది. ఈ భౌగోళిక మార్పుల నేపథ్యంలో, ఈ సీజన్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు ఏకంగా 84 శాతం అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో అత్యంత బలహీనమైన రుతుపవన సీజన్లలో ఒకటిగా ఇది మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రాంతాల వారీగా వర్షపాతాన్ని విశ్లేషిస్తే.. దేశంలో అధిక వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు ఉండే ‘మాన్సూన్ కోర్ జోన్’లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఈశాన్య భారతంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా.. వాయువ్య, మధ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో లోటు వర్షపాతం కంటిచూపుగా మారనుంది. అయితే, వాయువ్య, ఈశాన్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని తూర్పు తీర ప్రాంతాలలో అక్కడక్కడా సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే వీలుందని తెలిపింది.
ఇక, జూన్ నెలకు సంబంధించి దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగి, సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖలు, రైతాంగం ముందస్తుగా అప్రమత్తం కావాలని సూచించింది. నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం, కరవును తట్టుకునే ప్రత్యామ్నాయ విత్తనాల ఎంపిక వంటి ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చింది. కాగా, జులై నెలకు సంబంధించిన పూర్తిస్థాయి అంచనాలను జూన్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.







