కాక్రోచ్ జనతా పార్టీ’కి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు!
*ఎక్స్ ఖాతా తక్షణ పునరుద్ధరణకు న్యాయస్థానం నిరాకరణ.
*కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ.
ఢిల్లీ, మహా.
దేశంలో ఇటీవల కాలంలో తాజా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారి, పెద్ద సంఖ్యలో యువత, సెలబ్రిటీల మద్దతు కూడగట్టుకుంటున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి న్యాయస్థానంలో చుక్కెదురైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో తమ పార్టీ అధికారిక ఖాతాను ఇండియాలో నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు తక్షణ ఉపశమనం లభించలేదు. ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ ఆయన చేసిన విన్నపాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఎలాంటి ముందస్తు కారణం, వివరణ లేకుండానే తమ పార్టీ ఖాతాను ఎక్స్ సంస్థ ఏకపక్షంగా నిలిపివేసిందంటూ అభిజిత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. కీలకమైన సమయంలో సోషల్ మీడియా ఖాతాను నిలిపివేయడం వల్ల పార్టీ దైనందిన కార్యకలాపాలతో పాటు, ప్రజలతో ఉన్న సంబంధాలు, సమాచార మార్పిడి తీవ్రంగా దెబ్బతింటున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నష్టాన్ని నివారించేందుకు తక్షణమే పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్ కోరిన విధంగా తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించేందుకు నిరాకరించారు. అయితే, ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి కేంద్రం, ఎక్స్ సంస్థ తమ పూర్తిస్థాయి సమాధానాలను కోర్టుకు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జులై 7వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణ జరిగేంత వరకు ఆ పార్టీ ఖాతా పునరుద్ధరణపై సందిగ్ధత కొనసాగనుంది.







