Mahaa Daily Exclusive

  సాయం చేయబోయి కానరాని లోకాలకు…

Share

సాయం చేయబోయి కానరాని లోకాలకు.
* ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ముగ్గురి దుర్మరణం.
* వనపర్తి జిల్లా ముమ్మల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోరం.
కొత్తకోట,మహా.
పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్న సామెత ఆ యువకుల పాలిట నిజమైంది. కళ్లెదుటే తమ ప్రాంతానికి చెందిన వాహనం రహదారి పక్కన నిలిచి ఉండడాన్ని చూసి, సాయం చేసేందుకు వెళ్లిన వారిని మృత్యువు లారీ రూపంలో కబళించింది. టైరు పగిలిపోయి నిలిచిపోయిన వాహనానికి సాయం చేస్తుండగా జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన 44వ నంబర్ జాతీయ రహదారిపై వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మల్లపల్లి వద్ద తెల్లవారుజామున చోటుచేసుకుంది. దురదృష్టవశాత్తూ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురికీ ఒకరికొకరు కనీస పరిచయం లేకపోవడం కలచివేస్తోంది.

కొత్తకోట సీఐ రాంబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లికి చెందిన రవి అనే డ్రైవర్, గురువారం మధ్యాహ్నం తన బొలెరో వాహనంలో కొత్తిమీర లోడుతో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట సమీపంలో ఉన్న నేసేవీధికి చెందిన జగదీష్ (21) క్లీనర్‌గా ఆ వాహనం ఎక్కాడు. వాస్తవానికి హైదరాబాద్‌కు వచ్చే వాహనానికి డబ్బులు కలెక్షన్ చేసేందుకు బాలకృష్ణ అనే వ్యక్తి రావాల్సి ఉండగా, అతడు రాకపోవడంతో ఆ స్థానంలో జగదీష్ వచ్చాడు. వీరు ముమ్మల్లపల్లి వద్దకు రాగానే అర్ధరాత్రి సమయంలో బొలెరో కుడివైపు వెనుక టైరు పగిలిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రవి వాహనాన్ని రహదారి పక్కకు సురక్షితంగా నిలిపాడు. అటుగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు, రహదారి నిర్వహణ సంస్థ సిబ్బంది దీన్ని గమనించి, వాహనం చుట్టూ భద్రత కోసం కోన్స్, ఇండికేటర్స్ ఏర్పాటు చేసి వెళ్లారు.
అదే సమయంలో బాగేపల్లికి చెందిన రాజశేఖర్ (25), శివకుమార్ (24) వేరొక వాహనంలో అదే దారిలో వెళ్తున్నారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరో తమ ప్రాంతానిదేనని గుర్తించిన వారు, తమ వాహనాన్ని పక్కకు ఆపి డ్రైవర్ రవి వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. టైరు పగలడంతో మార్చాలని రవి చెప్పగా.. రాజశేఖర్, శివకుమార్ ఇద్దరూ కలిసి కింద కూర్చుని ఆ బొలెరో టైరును మారుస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వస్తున్న ఓ లారీ, రోడ్డు పక్కన టైరు మారుస్తున్న వారిపైకి దూసుకొచ్చి బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
అన్ని జాగ్రత్తలు తీసుకుని రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపినప్పటికీ, లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో బొలెరో బోల్తా పడింది.
ఈ భీకర ప్రమాదంలో వాహనం వద్ద ఉన్న జగదీష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, శివకుమార్‌లను హుటాహుటిన చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆ ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. తమ ప్రాంతం వారే కదా అని సాయం చేయబోయి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.