Mahaa Daily Exclusive

  భద్రతా బలగాలపై దాడులకు కుట్ర….

Share

భద్రతా బలగాలపై దాడులకు కుట్ర.
* మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా.
*ముగ్గురిపై విశాఖ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు.
విశాఖపట్నం, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో నిఘా వర్గాల కళ్లుగప్పి మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, ఇతర కీలక సామగ్రిని అత్యంత రహస్యంగా సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగాలు నమోదు చేసింది. వీరికి సంబంధించిన సమగ్ర చార్జిషీట్‌ను శుక్రవారం విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అధికారుల బృందం అధికారికంగా దాఖలు చేసింది. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లేలా భారీ కుట్ర పన్నిన ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏ లోతైన విచారణ జరిపి పలు కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నక్కా దేవిడ్ రాజ్ అలియాస్ డేవిడ్, విజయ్ విశ్వాస్‌లను మావోయిస్టు పార్టీకి చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా (ఓజీడబ్ల్యూ) దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరు అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను సేకరించి, వాటిని అండర్‌గ్రౌండ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టు కేడర్ సోడి కేసకు చేరవేస్తుండగా స్థానిక పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమాజానికి ముప్పుగా పరిణమించిన వీరి కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)తో పాటు పేలుడు పదార్థాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) వంటి అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
వాస్తవానికి ఈ కేసును 2024 సెప్టెంబర్ నెలలో స్థానిక పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారికంగా స్వీకరించింది. దర్యాప్తును వేగవంతం చేసిన కేంద్ర ఏజెన్సీ.. కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొనే భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు చేసేందుకు వీరు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను సేకరించి రవాణా చేస్తున్నట్లు నిర్ధారించింది. దేశ భద్రత, స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగించేలా ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఎన్‌ఐఏ తన చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ నెట్‌వర్క్ మూలాలు ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి, వీరికి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి అందుతోంది అనే కోణాల్లో తమ దర్యాప్తు ఇంకా ముమ్మరంగా కొనసాగుతోందని ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేశారు.