కడలూరు యువతి హత్యతో రాజకీయ వేడి.
* సీఎం విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి తీవ్ర విమర్శలు.
* రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ.. ‘సింగప్పెన్ ఫోర్స్’పై ప్రశ్నలు.
చెన్నై, మహా.
తమిళనాడులోని కడలూరులో సుమారు 25 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైన ఉదంతం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి తెరతీసింది. ఈ ఘోర ఘటనపై స్పందించిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. కడలూరులో యువతి దారుణ హత్యకు గురైన ఉదంతం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, తమిళనాడులో వరుసగా జరుగుతున్న హత్యలు, దోపిడీలు, లైంగిక దాడుల పరిణామాలు చూస్తుంటే అసలు రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉన్నాయా అనే అనుమానం సామాన్య ప్రజల్లో కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఈ ‘సోఫా మోడల్ గవర్నమెంట్’ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యలు, దోపిడీలు జరగని రోజంటూ లేదని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయ్ను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చేతిలో నోట్స్ చూస్తూ శాంతిభద్రతల గురించి పెద్ద పెద్ద పంచ్ డైలాగులు చెప్పిన వ్యక్తి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక కళ్లు మూసుకుని మొద్దు నిద్ర పోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి, ప్రస్తుతం ‘డీప్ స్లీప్ మోడ్’లోకి వెళ్లినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రత్యేక విభాగంపై ఉదయనిధి ప్రశ్నలు కురిపించారు. మహిళల భద్రత కోసం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘సింగప్పెన్ ఫోర్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమం చివరి నిమిషంలో రద్దయిందన్న వార్తలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసలు ఆ కార్యక్రమాన్ని కేవలం తాత్కాలికంగా వాయిదా వేశారా లేక ఆ పథకాన్నే పూర్తిగా పక్కన పెట్టేసారా అని ఆయన నిలదీశారు. ప్రజల ప్రాణాల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అత్యంత కీలకమైన అంశాలను ఈ ప్రభుత్వం నెమ్మదిగా నేర్చుకునేంత వరకు తమిళనాడు ప్రజలు వేచి చూసే పరిస్థితిలో లేరని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.








