Mahaa Daily Exclusive

  డీకే కు చెక్ పెట్టేందుకు సిద్ధ సరికొత్త వ్యూహం!

Share

డీకే కు చెక్ పెట్టేందుకు సిద్ధ సరికొత్త వ్యూహం!
* ప్రభుత్వ, పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి ప్రతిపాదన.
*కర్ణాటకలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. ఢిల్లీ వేదికగా మంతనాలు.
బెంగళూరు,మహా.
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యాధికార మార్పిడి వేళ ఆధిపత్య పోరు సరికొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడం, త్వరలోనే డీకే శివకుమార్ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం తెలిసిందే. అయితే, సీఎం పీఠాన్ని వదులుకున్నప్పటికీ.. పార్టీలోనూ, రాబోయే ప్రభుత్వ పాలనలోనూ తన పట్టును ఏమాత్రం కోల్పోకూడదని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల వద్ద ఆయన ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కర్ణాటక ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి ‘సమన్వయ కమిటీ’ని (కోఆర్డినేషన్ కమిటీ) ఏర్పాటు చేయాలని, దానికి చైర్మన్‌గా తనకు బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన వెంటనే సిద్ధరామయ్య తన కుమారుడితో కలిసి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలను విడివిడిగా కలుసుకున్నారు. రాబోయే డీకే శివకుమార్ క్యాబినెట్‌లో తన కుమారుడికి కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించాలని కోరడంతో పాటు, ఈ సమన్వయ కమిటీ ప్రతిపాదనను వారి ముందు ఉంచారు. రాబోయే రోజుల్లో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సజావుగా సంబంధాలు కొనసాగాలంటే ఇటువంటి కమిటీ ఎంతో అవసరమని ఆయన హైకమాండ్ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ హయాంలో పాలనాపరంగా తన ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవడానికే సిద్ధరామయ్య ఈ వ్యూహాన్ని పన్నినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో 2018వ సంవత్సరంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నడిచిన సమయంలో కూడా సిద్ధరామయ్య ఇటువంటి సమన్వయ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పట్లో ప్రభుత్వంపై నిరంతరం పర్యవేక్షణ ఉంచేందుకు ఆ పదవి ఆయనకు ఎంతో దోహదపడింది. ఇప్పుడు డీకే శివకుమార్ పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే.. మరోసారి అదే తరహా అస్త్రాన్ని సిద్ధరామయ్య ప్రయోగించారు. అయితే, గతంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందున సమన్వయ కమిటీ అవసరమైందని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సొంతంగా స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఇటువంటి ప్రత్యేక కమిటీల ఏర్పాటు అవసరం లేదని అధిష్ఠానం పెద్దలు సిద్ధరామయ్యకు సున్నితంగా తిరస్కరించినట్లు పార్టీ అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయినప్పటికీ, తన మార్క్ రాజకీయాలతో డీకే శివకుమార్‌కు ముకుతాడు వేసేందుకు సిద్ధరామయ్య గట్టిగానే ప్రయత్నిస్తుండటంతో కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.