Mahaa Daily Exclusive

  ఎస్ఐఆర్ ముసుగులో ఓట్లు ఏరివేసే కుట్ర అడ్డుకోవాల‌న్నపెద్దప‌ల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ…

Share

  • ఎస్ఐఆర్ ముసుగులో ఓట్లు ఏరివేసే కుట్ర
    అడ్డుకోవాల‌న్నపెద్దప‌ల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • శ్రేణుల‌కు ఎమ్మెల్యే వెడ్మ‌ బొజ్జు, న‌రేష్ జాద‌వ్, కంది శ్రీ‌నివాస రెడ్డి దిశానిర్దేశం
  • ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ-2 ల స‌మావేశం

ఆదిలాబాద్ మ‌హా : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎస్ ఐ ఆర్ ముసుగులో ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ అండ‌తో ప్రతిపక్షాల ఓట్లని ఏరివేసే చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని ప‌శ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈవిధంగానే అధికారం ద‌క్కించుకుంద‌ని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమ‌ర్శించారు. ఆదివారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ-2 ల స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. తమిళనాడు బెంగాల్ ముఖ్యమంత్రులు ఎన్నికల్లో తక్కువ మెజారిటీ తో పరాభవం చెందడానికి ఎస్ ఐ ఆర్ కార‌ణ‌మ‌న్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్రతిపక్ష పార్టీ ల అనుకూల ఓట్లను ఏరవేత‌తోనే వారు ఓట‌మిచెందార‌న్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ఇంధ‌నం పొదుపు చేయాలని తెలుపుతూ భారీ కాన్వాయిలు వేసుకొని తిరుగుతన్నారని విమానాల ద్వారా ప్రపంచం పర్యటన చేస్తూ మెలోడీ చాక్లెట్లు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుండి దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును కాపాడడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నిక‌లేవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే ల‌క్ష్యంగా కార్య‌క‌ర్త‌లు ప‌ని చేయాల‌ని సూచించారు.

బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుప‌టేల్

బీజేపీ ఎస్ఐఆర్ తో త‌మ‌కు అనుకూలం కాని ఓట్లు ఏరివేసే ప‌ని చేస్తుంద‌ని త‌మ బూత్ ల‌లో ఓట్ల తొల‌గింపు జ‌ర‌గ‌కుండా బీఎల్వోలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుప‌టేల్ అన్నారు. ఈవిష‌యంలో ఎట్టిపరిస్థితుల‌లో నిర్ల‌క్ష్యం ప‌నికి రాద‌న్నారు.బీజేపీ చేస్తున్న రైతుభ‌రోసా యాత్ర దండుపాళ్యం యాత్రగా విమ‌ర్శించారు.రైతుల‌ను మాయ మాట‌ల‌తో త‌ప్పుదో ప‌ట్టిస్తున్నార‌ని అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని డీసీసీ అధ్య‌క్షుడు న‌రేష్ జాద‌వ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ లో ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవడంలో బిఎల్ఎ ల పాత్ర కీలకమని ఆయ‌న తెలిపారు. అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి మాట్లాడుతూ పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్య‌న్న‌తియే ల‌క్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు.ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో పార్టీ నిర్వ‌హించిన బీఎల్ఏ-2ల స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. బీఎల్ఎ-1 అంటే డీసీసీ అధ్య‌క్షుడ‌ని బీఎల్ఏ-2 బూత్ లెవెల్ ఏజెంట్లు అని విడ‌మర్చి చెప్పారు. ఎస్ ఐఆర్ ప్ర‌త్యేక ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌మ‌కు అనుకూలంగా లేని ప్ర‌తిప‌క్షాల ఓట్లు తొలగించే చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని దీన్ని బీఎల్ఏ-2లు స‌మ‌ర్ధ‌వంతంగా అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు.రానున్న ఎంపీటీసీ జ‌డ్పీటీసీ అనంత‌ర ఎమ్మెల్యే ఎంపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని తెలిపారు. సీసీఐ విష‌యంలో స్థానిక ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ ఆదిలాబాద్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసార‌ని విమ‌ర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి సీసీఐ ని పున‌రుద్ద‌రించ‌లేక పోయార‌న్నారు. సీసీఐ ని తుక్కుకింద అమ్మ‌డం ఆయ‌న ఫెయిల్యూర్ గా అభివ‌ర్ణించారు. రాజకీయాలలో తొంద‌ర‌పాటు ప‌నికి రాద‌ని స‌హ‌నంగా వేచి చూస్తే అంద‌రికి ప‌ద‌వులు అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు. పార్టీని న‌మ్ముకొని ప‌నిచేయాల‌న్నారు. అలాగే ప్ర‌భుత్వ ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా అవి పూర్తిగా ప్ర‌జ‌ల్లోకి చేరేలా శ్రేణులు ప్ర‌చారం క‌ల్పించాల‌ని కోరారు. బీజేపీ కుట్ర పూరిత ఓట్ల తొల‌గింపును అడ్డుకుని పార్టీ విజ‌యానికి దోహ‌ద‌ప‌డాని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గ అబ్జ‌ర్వ‌ర్లు ర‌మేష్, అబ్దుల్లా కొత్వాల్, మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ బండారి అనూష‌, గ్రంథాల‌య చైర్మ‌న్ మ‌ల్లెపూల న‌ర్స‌య్య‌, బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడె గ‌జేంద‌ర్, ఆదిలాబాద్ ,జైన‌థ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్లు బోరంచు శ్రీ‌కాంత్ రెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి, ఆత్మ క‌మిటీ చైర్మ‌న్ గిమ్మ‌సంతోష్ రావు, నాయ‌కులు సాజీద్ ఖాన్, అల్లూరి సంజీవ రెడ్డి, గండ్ర‌త్ సుజాత‌, అడ్డి భోజారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.