Mahaa Daily Exclusive

  రైతు డిస్కం వెనుక భారీ కుట్ర….

Share

రైతు డిస్కం వెనుక భారీ కుట్ర.
* ప్రైవేటీకరణకే ప్రభుత్వాల పావులు.
* రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్.
* ఖమ్మం ఘటనలో చిన్నారికి రూ. 25 లక్షలు డిపాజిట్ చేయాలి.
* దసరాలోగా లక్ష్మీదేవిపల్లి పనులు మొదలుపెట్టకుంటే పాదయాత్ర తప్పదని హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ (రైతు) డిస్కంను ఏర్పాటు చేసి, మిగతా రెండు విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలు) ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగ సంస్కరణల ముసుగులో బడా కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, రైతాంగానికి, పేదలకు ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
రైతు డిస్కం అంశాన్ని ఆరు నెలల పాటు అత్యంత గోప్యంగా ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిన్నటి రోజున కేవలం చిట్ చాట్‌లో దాని గురించి మాట్లాడటం సరికాదని కవిత విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయం అని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్లో నిజాయితీ ఉంటే, ఆ విషయాన్ని అధికారికంగా ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలనే తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి.. చిట్ చాట్ మాటలను రేపు సులభంగా మార్చేస్తారని ఎద్దేవా చేశారు. మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం వంతపాడుతోందని ఆమె ఆరోపించారు.
రైతులకు తీవ్ర నష్టం చేకూర్చే వ్యవసాయ డిస్కంకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కవిత కోరారు. ఈ సంస్థకు వినియోగదారులంతా రైతులే అయినందున, వారి అభిప్రాయాలు తీసుకోవడం విధిగా జరగాలన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా ఈఆర్సీ పర్మిషన్ ఇస్తే.. తాము సుప్రీంకోర్టు వరకు వెళ్లైనా సరే ఈ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా తాము న్యాయస్థానంలో కేసు దాఖలు చేశామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతుల పట్ల తీవ్ర వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తోందని కవిత దుయ్యబట్టారు. రైతు భరోసాను కేవలం రెండు ఎకరాల లోపు రైతులకే పరిమితం చేశారని, రుణమాఫీ కేవలం 30 శాతం మందికే అందిందని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతు బీమాను సైతం యాక్సిడెంటల్ బీమాగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. ఇక సోలార్ ప్యానెల్స్, బ్యాటరీల తయారీ విధానంలో కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే ఇచ్చి చిన్న పరిశ్రమల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. దీనిద్వారా చైనా నుంచి ముడిసరుకు తెచ్చుకునే చిన్న కంపెనీలను మూసివేసి, కేవలం రిలయన్స్, అదానీ వంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని, వెంటనే చిన్న వ్యాపారులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైడ్రా చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో స్కూళ్ల నిర్వహణ, హైడ్రా వ్యవహారశైలిపై సాక్షాత్తూ న్యాయస్థానాలే ప్రభుత్వాన్ని మందలిస్తున్నా పాలకుల్లో మార్పు రావడం లేదన్నారు. బడా వ్యక్తులు చేసిన కబ్జాలపై తాను స్వయంగా ఫిర్యాదులు చేసినా హైడ్రా వాటిని పక్కన పెట్టి.. కేవలం పేదలను మాత్రమే ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ఇక ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పసిగుడ్డు చేయి తీసేయాల్సిన దుస్థితి తలెత్తడం అత్యంత బాధాకరమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు అయిపోయి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే, సరైన వైద్యం అందించకపోవడం దారుణమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ చిన్నారి పేరిట రూ. 25 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పాలమూరు ప్రాజెక్టు సమీక్ష కోసం కుమ్మెర గ్రామానికి వెళ్తున్న సీఎం.. అక్కడే కుల వివక్షకు బలైన ఓ చిన్నారి కుటుంబాన్ని తప్పక పరామర్శించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను దసరా లోపు ప్రభుత్వం ప్రారంభించకపోతే, ఆ మరుసటి రోజు నుంచే తాను పాదయాత్ర చేపడతామని కవిత అల్టిమేటం జారీ చేశారు.