టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.
* జూన్ 16 నుంచి 22 వరకు ఎగ్జామ్స్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్ – జూన్ 2026) పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఆదివారం ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – సీబీటీ) ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల రద్దీ దృష్ట్యా మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో విద్యాశాఖ ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనుంది.
ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో షిఫ్ట్ నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న రెండు సెషన్లలోనూ పేపర్-1 పరీక్ష జరగనుంది. జూన్ 17న ఉదయం షిఫ్ట్‌లో పేపర్-1, మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్-2 (గణితం, సైన్స్) నిర్వహిస్తారు. అలాగే జూన్ 18వ తేదీన రెండు సెషన్లలోనూ పేపర్-2 (గణితం, సైన్స్) జరగనుండగా, జూన్ 19న రెండు సెషన్లలోనూ పేపర్-2 (సాంఘిక శాస్త్రం) పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-1, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.
టెట్ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలు, హాల్ టికెట్ల డౌన్‌లోడ్ తదితర సమాచారం కోసం అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ‘schooledu.telangana.gov.in’ ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో అభ్యర్థులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువులు సాధించాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు.








