ఓట్లు గల్లంతైతే రాజకీయ భవిష్యత్తు శూన్యం.
* లక్షన్నర ఓట్లపై నిఘా పెట్టాల్సిందే!
* ఖమ్మం ఓటర్ల మ్యాపింగ్‌పై పార్టీ శ్రేణులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు, ముఖ్య నాయకులకు తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎస్ఐఆర్’ ప్రక్రియలో భాగంగా ఓట్ల మ్యాపింగ్ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భవిష్యత్తులో రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన తన ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్ల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క ఓటును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని, అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ఉద్ఘాటించారు.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల గణాంకాలను విశ్లేషిస్తూ మంత్రి పలు సంచలన విషయాలను వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 3,02,800 ఓట్లు నమోదు కాగా, ప్రస్తుత ‘ఎస్ఐఆర్’ కార్యక్రమంలో కనీసం సగం ఓట్లు కూడా మ్యాపింగ్ కాలేదన్న వాస్తవాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితులను గమనిస్తుంటే సుమారు లక్షన్నరకు పైగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నిర్లక్ష్యం కారణంగా సగానికి పైగా, అంటే సుమారు 55 శాతం ఓట్లను కోల్పోయే దుస్థితి రావడం పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన విశ్లేషించారు. ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి ప్రతి కార్యకర్త, నాయకుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఓట్లను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఓట్లను కాపాడుకోలేని నాయకులకు భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి మనుగడ ఉండబోదని ఆయన కుండబద్దలు కొట్టారు.
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్ల స్వల్ప తేడాతోనే తాము విజయం సాధించామన్న చేదు నిజాన్ని నాయకులు మర్చిపోకూడదని ఆయన సూచించారు. ఏమాత్రం పట్టుతప్పినా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. రాజకీయాలు అనేవి ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదని, రాజకీయాల్లో కొనసాగాలి అనుకునే వారికి ఇది ఒక విధంగా జీవన్మరణ సమస్య లాంటిదని ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను సైతం ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి ఉద్ధండులు సైతం కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు, పరాజయాలకు దారి తీసిన కారణాలను ప్రతి ఒక్కరూ లోతుగా విశ్లేషించుకోవాలని ఆయన హితవు పలికారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైతే ఎంతటి నాయకులకైనా పరాభవం తప్పదనే సత్యాన్ని ఆయన గుర్తు చేశారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వెనుక ప్రత్యర్థి పార్టీల కుట్రలు ఉన్నాయన్న ప్రచారాన్ని సైతం మంత్రి ఈ వేదికగా ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని, ఇతర పార్టీలు సైతం తమదైన శైలిలో తెరవెనుక రాజకీయాలకు తెరతీశాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, కుట్రలను ఛేదించాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయాలంటే అప్రమత్తత ఒక్కటే ఆయుధమని మంత్రి తేల్చి చెప్పారు. ఈ ప్రక్రియను కేవలం రాజకీయ కోణంలోనే చూడకుండా, ఎన్నికల అధికారులతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. అధికారులకు అవసరమైన సహకారం అందిస్తూ, వారితో కలిసి పని చేయడం ద్వారానే ప్రతి ఓటరును జాబితాలో చేర్చగలమని, మన ఓటు బ్యాంకును పదిలపరుచుకోగలమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.








