- పోక్సో కేసులో బండి భగీరథ్ కు ఊరట
- వారం రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- చర్లపల్లి జైలు నుంచి విడుదల
- పరీక్షల కోసం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు
- 26 వరకు బెయిల్ పై ఇంట్లో ఉండనున్న భగీరథ్
హైదరాబాద్, మహా : తీవ్ర సంచలనం సృష్టించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో బిగ్ అప్‌డేట్ వచ్చింది. నెల రోజులకుపైగా చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య కోర్టు హాల్‌లో సుదీర్ఘంగా సాగిన వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భగీరథ్‌కు పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో జూన్ 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ హైప్రొఫైల్ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒక కేంద్రమంత్రి కుమారుడు నిందితుడిగా ఉండటం, కేసులో తీవ్రమైన పోక్సో చట్టం సెక్షన్లు నమోదు కావడంతో పోలీసులు కూడా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు నెల రోజులపాటు జైలు జీవితం గడిపిన భగీరథ్, లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకొని చర్లపల్లి జైలు నుంచి శనివారం విడుదలయ్యారు.
హైదరాబాద్ శివారులోని పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 8వ తేదీ రాత్రి పది గంటల సమయంలో బండి భగీరథ్‌పై తొలి ఎఫ్‌ఐర్ నమోదు అయ్యింది. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ప్రకారం 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ వేడుకల సమయంలో బండి భగీరథ్, 17 ఏళ్ల తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపించారు. తీవ్రమైన ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును ప్రాథమిక దర్యాప్తు చేసి, నిందితుడిపై బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 74, సెక్షన్ 75తోపాటు పోక్సో యాక్ట్ 2012లోని సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేశారు.
నెలరోజలకుపైగా జైల్లోనే
కేసు నమోదు కాగానే రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ కేసు విచారణ కోసం డీసీపీ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయ్యింది. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అనంతరం పోలీసులు చట్టపరమైన చర్యలను తీసుకున్నారు. అప్పుడు భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఉపశమనం లభించలేదు. దీంతో మే 16వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌ను అరెస్టు చేసి మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అధికారులు అతనిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు పంపించారు. ఆ తర్వాత రిమాండ్‌ను మరింత పొడిగించంతో దాదాపు నెలరోజలకుపైగా అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంజినీరింగ్ పరీక్షలు ఉన్నాయని కోర్టుకు విన్నవించుకోవడంతో మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 26 వరకు బండి భగీరథ్ ఇంటి వద్ద ఉండనున్నారు. దీనికి సంబంధించి కోర్టు కొన్ని షరతులను విధించింది.








